మేధ తెలుసుకుందాం

ట్రాఫిక్ సమస్య!

  • 23/01/2012

నగరాల్లో ఉండేవారు, తలా ఒక కారు ఉండాలనుకుంటారు. దారిలోకి చేరిన తర్వాత మాత్రం ట్రాఫిక్‌లో ఇరుక్కుని పిచ్చెత్తుతుంటారు. ఈ జామ్‌ల కారణంగా కాలంతోబాటు విలువైన ఇంధనం కూడా దండగవుతుంది. అమెరికాలో 1982లో సగటున ప్రతి ఒక కారుకు ఏటా 14 గంటల కాలం ట్రాఫిక్ జామ్‌లో గడిచేది. 2009 నాటికి అది 34 గంటలయింది. ఇక మన దేశంలో నగరాల సంగతి చెప్పనవసరం లేదు.
ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా హాయిగా సాగాలంటే ముందు కార్లు మిగతా వాహనాల సంఖ్య తగ్గాలి. రోడ్లు మరిన్ని రావాలి. దీనికన్నా ముందు, డ్రైవింగ్‌లో పిల్లలాడుకునే పద్ధతిని ప్రవేశపెడితే బాగుంటుంది అంటున్నారు నిపుణులు. చిన్న పిల్లలు రైలు ఆట ఆడుతుంటారు. మొదటి వ్యక్తి ఇంజన్! మిగతావారు పెట్టెలు. అవసరం కొద్దీ పెట్టెలు ఇంజను కావచ్చు. లేక విడిపోయి వేరు కూడా కావచ్చు. దీన్ని సెమీ ఆటనామస్ డ్రైవింగ్ అంటున్నారు.
స్వీడెన్‌లో వోల్వో కంపెనీవారు ఈ రోడ్ ట్రెయిన్ పద్ధతిని అమలు చేసి పరిశీలిస్తున్నారు. వరసలో మొదటి కారులో మాత్రమే మనిషి ‘డ్రైవ్’ చేస్తుంటారు. అక్కడి స్టీరింగ్, బ్రేక్, త్రాటిల్‌లనుంచి వయర్‌లెస్ పద్ధతిలో వరుసలోని మిగతా కార్లకు సమాచారం అందుతూ ఉంటుంది. ఆ సమాచారం ప్రకారం కార్లు ముందు దారి వెంట వరుసగా వెళుతూ ఉంటాయి. ఆ కార్లలోని మనుషులు ఏమీ పట్టించుకోనవసరం ఉండదు. అంటే వారు చదవడం, తిండి తినడం లాంటి పనులను చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడు కార్ల వరుసతో ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలోనే అయిదు కార్లతో ప్రయత్నం కొనసాగుతుంది. అమెరికాలో కూడా ఇటువంటి ప్రయోగం ఒకటి మొదలయింది. ఇక్కడ మాత్రం కార్లకు మధ్యన లంకె ఉంటుంది. ఇక్కడ మొదటికారు నిజంగా ఇంజనులాగా పనిచేస్తుంది. మిగతా కార్లకు కింద రోడ్డుతో ఉండే ఒక ట్రాక్ నుంచి, శక్తి, సమాచారం అందుతూ ఉంటాయి. బొమ్మ కార్ల ట్రాకులో మాదిరి ఇక్కడ పవర్ అంతా ట్రాక్‌లో ఉంటుంది. ఒక కారు, వరుసలోనుంచి విడిపోదలచుకుంటే, సమాచారం పంపవచ్చు. నిజానికి వరుసలో కారు స్థానం, దారి ఆకారం, గమ్యాలను బట్టి నిర్ణయింపబడుతుంది. వరుసంతా అక్కడక్కడ ఆగుతుంది. కొన్ని కార్లు విడిపోతాయి. కొత్తవి వచ్చి చేరుకుంటాయి. ఈ పద్ధతితో ట్రాఫిక్ ఫ్లోను మూడింతలు పెంచవచ్చునంటున్నారు పరిశోధకులు బ్రూస్ మెక్ హెన్రీ.
ఈ రెయిల్ కార్లకు, ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సంబంధం ఉంటుంది. రోడ్డు పరిస్థితి కూడా వాటికి తెలిసి ఉంటుంది. 2013 సంవత్సరంలో ఈ పద్ధతి పెద్ద ఎత్తున వాడుకలోకి వచ్చే వీలుంది, అంటున్నారు!
ఒక్క యు.ఎస్‌లోనే ట్రాఫిక్ సమస్యల కారణంగా 115 బిలియన్ డాలర్ల ఇంధనం వ్యర్థమవుతున్నదట. సమస్య నిజంగా సీరియస్ అని అర్థం!

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading