క్రీడాభూమి

ముక్కోణపు సిరీస్‌లో నేడు భారత్-ఆసీస్ తొలి పోరు

  • 05/02/2012

మెల్బోర్న్, ఫిబ్రవరి 4: ఆస్ట్రేలియా పర్యటనలో మొట్టమొదటిసారిగా రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో సాధించిన గెలుపుతో లభించిన విజయోత్సాహాన్ని ఆదివారం ఇక్కడ ప్రారంభం కానున్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో కొనసాగించాలనే దృఢ చిత్తాన్ని టీమిండియా కనబరుస్తోంది. టెస్టు సిరీస్‌ను 0-4 తేడాతో అప్పనంగా ఆస్ట్రేలియాకు అప్పగించిన భారత జట్టు ఆ తర్వాత జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్‌లోనూ ఓడిపోయి అవమాన భారాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో యువ కిశోరాలతో నిండిన టీమిండియా సమష్టిగా రాణించి ఆసీస్‌పై ఎనిమిది వికెట్ల ఆధిక్యంతో విజయం సాధించి ఈ పర్యటనలోనే తొలిసారి గెలుపు రుచి చూసింది. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, రాహుల్ శర్మ వంటి యువ ఆటగాళ్ల చేరికతో నూతన జవసత్వాలు పుణికిపుచ్చుకున్న టీమిండియా రెండో ట్వంటీ-20 మ్యాచ్ గెలుపు ఊపును ముక్కోణపు వనే్డ సిరీస్‌లో కొనసాగించాలని చూస్తోంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌లో తమను చావుదెబ్బ తీసిన ఆసీస్‌తోనే సిరీస్‌లో తొలి వనే్డ మ్యాచ్‌ను ఆదివారం ఇక్కడ ఆడనున్న టీమిండియా అందులో ఎలాగైనా గెలిచి తీరాలని పరితపిస్తోంది. ఈ సిరీస్‌లో మూడో జట్టుగా శ్రీలంక ఆడుతోంది. ముఖ్యంగా తమ ఫీల్డింగ్ గణనీయంగా మెరుగుపడడంతో విజయం అటు నుంచి ఇటు వచ్చిందని, దీన్ని వనే్డ సిరీస్‌లోనూ కొనసాగిస్తామని టీమిండియా ఆటగాళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వెటరన్ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ సహా కొందరు సీనియర్లు జట్టులో చేరారు. వందో సెంచరీకి అడుగు దూరంలో ఉన్న సచిన్ ఈ ముక్కోణపు సిరీస్‌లో దాన్ని సాధిస్తాడని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కారణమో, మరోటో కాని తెండూల్కర్ గత సంవత్సర కాలంగా అసాధారణ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఈ కాలంలో ఆడిన 11 టెస్టులు 21 ఇన్నింగ్స్‌ల్లో ఆడిన సచిన్ ఇంకా గాడిన పడలేకపోతున్నాడు. వీటిలో రెండుసార్లు తొంబైలలో, ఒకసారి 80లో ఔటైన సచిన్ ఈ ఒత్తిడి నుంచి బయటపడాల్సి ఉంది. ఇప్పుడు సచిన్ అందుబాటులో ఉండటంతో రవిచంద్రన్ అశ్విన్, లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మలలో ఎవరో ఒకరికి ఎంసిజి మైదానంలో ఆడే అవకాశం రాకపోవచ్చు.
ఆరడుగుల మూడంగుళాల ఎత్తున్న రాహుల్ శర్మ బౌలింగ్‌లో ఫ్లాట్‌గా ఉండే ఎంసిజి పిచ్‌పైనా అసాధారణ స్థాయిలో బంతి బౌన్స్ అవుతుందని, వాటిని ఎదుర్కోవడం కష్టమని ఆసీస్ ట్వంటీ-20 టీమ్ కెప్టెన్ పేర్కొన్నాడు. అశ్విన్, రాహుల్ ఇద్దరినీ ఆడించాలని భారత్ అనుకుంటే బహుశా రోహిత్ శర్మకు ఆడే అవకాశం రాకపోవచ్చు. మరోవైపు, టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్, మైఖేల్ హస్సీ వంటి మేటి ఆటగాళ్ల చేరికతో ఆసీస్ జట్టు బలోపేతం కానుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఫాస్ట్ బౌలర్ ర్యాన్ హర్రీస్, లెఫ్ట్-ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ జట్టులో ఉన్నారు.
ఇవీ జట్లు
ఆస్ట్రేలియా: మైఖేల్ క్లార్క్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, రికీ పాంటింగ్, పీటర్ ఫారెస్ట్, డాన్ క్రిస్టియన్, డేవిడ్ హస్సీ, మైఖేల్ హస్సీ, మాథ్యూ వేడ్, బ్రెట్‌లీ, ర్యాన్ హర్రీస్, మిచ్ స్టార్క్, క్సేవియర్ డొహెర్టీ, క్లింట్ మెక్‌కే, మిచ్ మార్ష్.
భారత్: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), గౌతం గంభీర్, వీరేందర్ సెహ్వాగ్, సచిన్ తెండూల్కర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ శర్మ, ప్రవీణ్ కుమార్, వినయ్ కుమార్, జహీర్ ఖాన్.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading