భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సంతోషం! కానీ గురుదేవా! రాక్షసుల బలపరాక్రమాలకు ముల్లోకాలు గడగడలాడే మంచి కాలం ఇక రాదా! దేవతలను జయించగల పుత్రుడు కలగడానికి ఏం చేయాలో సెలవివ్వండి!’’ ప్రాధేయపూర్వకంగా అడిగారు రంభ కరంభులు!
గంభీరంగా తలపంకించాడు శుక్రాచార్యుడు!
‘‘ఒక్క మార్గం వుంది! సంతానదాయకుడు వరుణుడు! మీరు అతడిని తపస్సుతో మెప్పించి మీ కోరిక తీరేలా వరం కోరుకోండి! శీఘ్రంగా ప్రసన్నుడు కాగలడు వరుణుడు! మీరు వెంటనే తరలి వెళ్లండి!’’ అంటూ ఉపదేశించాడు!
‘‘కృతజ్ఞులం గురుదేవా! ఇప్పుడే బయలుదేరి వెళుతాము!’’ అంటూ నమస్కరించారు అన్నదమ్ములు!
నిర్జనమైన వన ప్రాంతాన్ని చేరుకుని దగ్గరలో వున్న కొలనులో ప్రవేశించి నీటిలో నిలిచి తపస్సులో నిమగ్నుడైనాడు కరంభుడు! దగ్గరలోనే చుట్టూ పంచాగ్నులు రగుల్చుకొని వాటిమధ్య నిలిచి తపస్సు ప్రారంభించాడు రంభుడు!
***
‘‘నారాయణ! నారాయణ!’’ మహతి మీటుతూ ప్రవేశించిన నారదుని చూసి ఇంద్రునితో సరససల్లాపాలు ఆడుతున్న రంభ లేచి ‘‘ప్రణామాలు మునీంద్రా!’’ అంటూ నమస్కరించి మెల్లగా అక్కడనుండి వెళ్లిపోయింది!
‘‘ఈ సమయంలోనే రావాలా ఈ నారదుడు! సమయం, సందర్భం వుండవు ఈ తాపసులకు!’’ అని లోలోన విసుక్కుంటూ పైకి చిరునవ్వుతో ‘‘రండి! నారదమహర్షి! ఏమిటీ సమయంలో వచ్చారు? ఏదో వార్త తీసుకునే వచ్చి ఉంటారు, వూరక రాను గదా మహానుభావులు!’’ అన్నాడు కొద్దిగా వ్యంగ్యం నిండిన స్వరంతో ఆసనం చూపుతూ!
‘‘ఏం చేయమంటావు దేవేంద్రా! మీ దేవతలందరూ హాయిగా సుఖభోగాలతో మునిగి కాలం గడిపేస్తున్నారు! దైత్య దానవుల బెడద తీరడంతో ఇక ఏ బెడదా లేదన్న ధీమాతో సభా సమావేశాలు మానేసి దేవ మర్త్య లోకాల పరిస్థితులు గమనించడం వంటి పనులేమీ చేయకుండా విలాసాలలో కాలం గడిపేస్తూ పొంచి వున్న ప్రమాదాన్ని తెలుసుకోవడం లేదు నీవు! ఆ విషయం చెప్పడానికే వచ్చాను! సరే, నీవేదో ముఖ్యమైన పనిలో వున్నట్లున్నావు! వెళతానులే, నారాయణా! నారాయణా!’’ అంటూ లేవబోతున్న నారుదుని వారిస్తూ ‘‘ప్రమాదమా? ఎవరినుండి మహర్షి? కాస్త వివరంగా చెప్పండి!’’ అడిగాడు ఇంద్రుడు ఆందోళనగా చూస్తూ!
‘‘్భలోకంలో బదరికాశ్రమ ప్రాంతంలో మునిగణాలను కలుసుకుని వస్తున్నాను! అక్కడంతా సుభిక్షంగానే వుంది గానీ కొంతకాలంగా రంభ, కరకంభులనే ఇద్దరు దానవులు కొద్ది దూరంలో తీవ్ర తపశ్చర్యలో మునిగి వున్నారని తెలిపారు. మాటల సందర్భంలో వాళ్లగూర్చి తెలుసుకున్నాను! పుత్ర సంతానం కోసం వరుణుని గూర్చి తపస్సు చేస్తున్నారుట! వరుణుడు వాళ్ల తపస్సుకు మెచ్చి వరాలు ప్రసాదిస్తే మీకే కష్టాలు వచ్చే ప్రమాదం వుంది గదా! అందుకే నిన్ను జాగ్రత్తపడమంటున్నాను!’’ తాపీగా విషయం చెప్పాడు నారద మహర్షి!
ఇంద్రుని కనుబొమ్మలు ముడివడ్డాయి!
‘‘సమయానికి వచ్చి సావధానుడిని చేసినందుకు కృతజ్ఞతలు నారద మునీంద్రా! వరుణుని గూర్చి తపస్సు చేస్తున్న ఆ రాక్షసులనిప్పుడే వధించి వస్తాను! మొగ్గలోనే శతృవులను త్రుంచివేయడం మంచిది గదా!’’ అంటూ లేచాడు.
***
రంభ, కరంభులు తపస్సు చేస్తున్న ప్రాంతాన్ని చేరి వాళ్ల తపస్సు భగ్నం కావించడానికి యత్నించాడు ఇంద్రుడు! కరంభుడు నీటిలో మునిగి వుండటం గమనించి తాను మొసలి రూపంలో ఆ జలాలలో ప్రవేశించి కరంభుని చుట్టివేశాడు! ఇద్దరిమధ్యా తీవ్ర పోరాటం జరిగి చివరకు కరకంభుడు మొసలి పట్టుకు లొంగి మరణించాడు.!

-ఇంకా ఉంది

-డా టి. కళ్యాణీసచ్చిదానందం