తెలంగాణ

చెర వీడని టిఆర్‌ఎస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 20: మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇంకా చెర వీడలేదు. వారిని విడిపించేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సత్ఫలితాలు ఇవ్వటం లేదు. నేతలు అపహరించబడిన పూసుగుప్ప గ్రామస్థులను పోలీసులు మావోల వద్దకు మధ్యవర్తులుగా పంపించినట్లు తెలుస్తోంది. అయితే వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. మరోవైపు బందీల్లో ఒకరైన సురేష్ భార్య పూసుగుప్ప గ్రామానికి చేరుకొని తన భర్త కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మరణించటంతో దాని ప్రభావం ఈ సంఘటనపై పడుతుందేమోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఆరుగురు నేతల్లో ఒకరు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన రామకృష్ణ కూడా ఉండటంతో టిఆర్‌ఎస్ నాయకత్వం చొరవతో తమ వారు విడుదలవుతారని బందీల కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే టిఆర్‌ఎస్ రాష్టస్థ్రాయి నేతలెవరూ ఇంత వరకు బాహాటంగా ఒక్క ప్రకటన కూడా చేయకపోవటం విమర్శలకు తావిస్తోంది. జిల్లా నేతలు మాత్రం బందీలను మానవతాదృక్పథంతో విడిచిపెట్టాలని, రాష్ట్ర ప్రజల ఆశయం కోసం పని చేసిన వారిని శిక్షించవద్దని మీడియా సమావేశాలు పెట్టి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మావోయిస్టులు తొలిసారిగా అధికార పార్టీ నేతలనే అపహరించి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు జరుగుతుండగా మావోయిస్టుల ప్రభావం ఆ ఎన్నికలపై పడకుండా ఉండేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనల్లో ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత అని మావోయిస్టులు పేర్కొంటున్నారు. తాడ్వాయి ఎన్‌కౌంటర్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఎదురుకాల్పుల సంఘటనలను ఉదహరిస్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లా అటవీప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటం, ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో పోలీసులదే పైచేయిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉనికిని చాటుకోవటంతో పాటు పోలీసులపై పైచేయి సాధించేందుకు ఈ సంఘటనలను ఉపయోగించుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి ఏ మార్గంలో వెళ్ళే వాహనాన్నైనా కచ్చితంగా తనిఖీలు చేస్తున్నారు.

పతుల కోసం సతుల అడవి బాట!
చర్ల, నవంబర్ 20: మావోయిస్టుల చెరలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు సంతపూరి సురేష్, డెక్కా సత్యనారాయణల సతీమణులు భర్తల కోసం శుక్రవారం అడవి బాట పట్టారు. ఉదయానే్న వారిని వెతుక్కుంటూ పూసుగుప్ప అడవుల్లోకి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చారు. ఈ సందర్భంగా పూసుగుప్ప గ్రామానికి వెళ్లిన విలేఖర్లతో వారు మాట్లాడారు. తమ ఇబ్బందిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో తాము అడవి బాట పట్టాల్సి వచ్చిందని వారు చెప్పారు. తమ భర్తలు ఏ తప్పూ చేయలేదని, దయజేసి వారిని వదిలిపెట్టాలని భోరున విలపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి తమవారిని మావోల చెర నుంచి విడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని కోరారు.