తెలంగాణ

ఊరంతా... తాకట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 8: భూమితల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే భూమిపుత్రుల కష్టార్జితం మార్వాడీ బీరువాల్లో మూగగా రోదిస్తోంది. ఒకరూ ఇద్దరు కాదు.. మొత్తం గ్రామమే తాకట్టులో తల్లడిల్లుతోంది. ఆపదనుంచి ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సర్కారు బీమా వారిలో ధీమాను పెంచకపోగా, మరింత కుంగిపోయేలా చేస్తోంది. శ్రమించి పండించిన పంటతో కొన్న బంగారం విడిపించుకోలేక మార్వాడీలకే వదిలేస్తున్న దారుణ దయనీయమిది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందలమంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. ఇదీ మెదక్ జిల్లా జిన్నారం మండలం నల్లవల్లి గ్రామ రైతుల వ్యథ. గ్రామంలో 300 మందికి పైగా రైతులు తులం, రెండు తులాలు ఎంత ఉంటే అంత నర్సాపూర్, వికారాబాద్ మార్వాడీల వద్ద తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. కేవలం బంగారంపైనే సుమారు 45 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారంటే రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. వడ్డీ పెరిగి, గడువు ముగిసిపోవడంతో ఇప్పటివరకు సుమారు 20 లక్షల విలువైన బంగారు నగలను మార్వాడీలకే సమర్పించుకున్నారు. 600మందికి పైగా రైతులు బ్యాంకు రుణాలిచ్చే ఆపన్నహస్తం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదాహరణకి ఎర్రోళ్ల రాజు అనే రైతు తనకున్న ఎకరం పొలంలో లక్షన్నర అప్పు తెచ్చి రెండు బోర్లు వేశాడు. వీటిలో ఒకటి నీరు పడకపోగా, మరొకటి ఎండిపోయంది. బంగారాన్ని, భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకురావడంతో వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నాడు. మూడు తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న 60వేలు అప్పు తీర్చే దారి లేకపోవడంతో అది కాస్తా మార్వాడీలపరమయ్యే పరిస్థితి నెలకొంది.
రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులు రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సివున్నా బ్యాంకర్ల చిన్నచూపు అన్నదాతను అవస్థలకు గురిచేస్తోంది. ప్రతి ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతులు బ్యాంకుల నుంచి తీసుకునే పంట రుణాల నుంచి బీమా సొమ్మును మినహాయస్తున్నా, పంటలకు నష్టం వాటిల్లిన సమయంలో ఒక్క రైతుకూ బీమా సొమ్ము అందడం లేదు. నల్లవల్లి గ్రామంలో అంతా చిన్న, సన్నకారు రైతులే ఉండగా, ఒక్కరికి కూడా ఐదు ఎకరాలకు మించి వ్యవసాయ పొలం లేకపోవడంతో పెట్టుబడి కోసం తప్పనిసరిగా బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్సర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంకుల సహకారం అందకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చి నట్టేట మునుగుతున్నారు. ఈ విషయమై తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సంక్షేమం కోసం పోరాటానికి శ్రీకారం చుట్టింది. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని దరఖాస్తు నమూనాను తయారు చేసి ఆయా బ్యాంకులకు దరఖాస్తులను సమర్పిస్తున్నారు. నర్సాపూర్ తాలుకా నుంచి ఈ కార్యక్రమానికి తెరలేపారు. ఇటీవల నల్లవల్లి గ్రామానికి చెందిన రైతులంతా నర్సాపూర్‌లోని వివిధ బ్యాంకులకు దరఖాస్తులు సమర్పించారు. ఆర్‌బిఐ నిబంధనల మేరకు బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వకపోతే సరికొత్త పోరాటానికి తెరలేపడానికి సిద్ధంగా ఉన్నట్లు రైతు రక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ జి.రంగాగౌడ్ వెల్లడించారు. ఈ పోరాటాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించి రైతులకు న్యాయం చేకూరే వరకు కొనసాగిస్తామన్నారు.
7 తులాల బంగారం పోయింది
భవాని, మహిళా రైతు నల్లవల్లి
పంటలు పండితే కుటుంబాలు నిండుగా ఉంటాయన్న ఆశతో ఉన్న ఏడు తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి పంటలను సాగు చేస్తే కనీస పెట్టుబడి కూడా రాలేదు. ఉన్న బంగారాన్ని విడిపించుకోలేక వడ్డీ వ్యాపారులకే వదులుకోవాల్సి వచ్చింది. బ్యాంకు అధికారులు కనీసం స్పందించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతు రక్షణ సమితి చేపడుతున్న కార్యక్రమం ద్వారానైనా బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు ఇస్తే ప్రైవేట్ అప్పులను తీర్చుకుని ఉపశమనం పొందుతాం. లేదంటే పరిస్థితి చెప్పనలవి కానిది.

సాగు కాదు.. అంతా వ్యథ
ప్రకృతి వైపరీత్యాలు నిత్యం వెంటాడుతుంటే పట్టించుకునే నాథుడు లేక పంటల సాగు కాదు కదా అంతా వ్యథగానే మిగులుతోంది. పాసు పుస్తకాలు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. చేసిన అప్పులకు వడ్డీపై వడ్డీ పెరుగుతుంటే ఉన్న భూమిని అమ్ముకునే దుస్థితి నెలకొంది. ఇంట్లో బంగారం కూడా లేకుండా పోయింది. వివాహాది శుభ కార్యాలకు వెళ్లేందుకు మెడలో బంగారం లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొరవి చంద్రం, నల్లవల్లి

టి. మురళీధర్