తెలంగాణ

రోడ్డెక్కిన ఎర్రజొన్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఫిబ్రవరి 15: ఎర్రజొన్న రైతన్న మరోసారి రోడ్డెక్కాడు. పదేళ్ల క్రితం మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు ప్రస్తుతం మరోసారి ఆందోళన బాట పట్టారు. గురువారం ఆర్మూర్ డివిజన్‌లోని వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు మద్దతు ధర కోసం ఆమరణ నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్మూర్ మం డలం మామిడిపల్లి గ్రామ చౌరస్తా వద్దకు రైతులు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ముందుగా కొంత భయపడిన రైతులు ఆ తర్వాత ఒక్కొక్కరుగా చేరుకొని 63వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. సుమారు రెండున్నర గంటల పాటు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు వన్ వే ద్వారా వాహనాల రాకపోకలను క్లియర్ చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రజొన్న క్వింటాల్‌కు 4500 రూపాయలు, పసుపు క్వింటాల్‌కు 15 వేల రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా రైతులు ఆందోళన చేపట్టారు. మామిడిపల్లి చౌరస్తా వద్దే ఆమరణ దీక్ష చేపట్టాలని బైఠాయించిన రైతులు ఎండ తీవ్రత పెరగడంతో అక్కడి నుంచి ర్యాలీగా ఆర్మూర్ పట్టణంలోని కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తహశీల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు 144 సెక్షన్ విధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చాలా సేపు తహశీల్ కార్యాల యం ఎదుట బైఠాయించిన రైతులు చివరకు టెంట్ వేసుకొని ఆమరణ నిరాహార దీక్షలను ప్రారంభించా రు. ఈ కార్యక్రమానికి వేల్పూర్, బాల్కొండ, మోర్తా డ్, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, నందిపేట్, ఆర్మూర్ మండలాల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆర్మూర్ ఇన్‌చార్జి ఏసీపీ రవీందర్ ఆధ్వర్యంలో సీఐలు రమణారెడ్డి, సీతా రాం, శ్రీశైలం, సైదయ్య, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు భారీ సంఖ్యలో చేరుకొని బందోబస్తు నిర్వహించారు.
21 మంది రైతుల ఆమరణ దీక్షలు
ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని తహశీల్ కార్యాలయం ఎదుట 21 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆర్మూర్ డివిజన్‌లోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు దీక్షలో కూర్చున్నారు.

చిత్రం..ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు