తెలంగాణ

మంజీరాలో మహా.. దోపిడీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, ఏప్రిల్ 23: తెలంగాణ శశ్యశ్యామలం సంగతెలా ఉన్నప్పటికీ మరాఠా ఇసుక క్వారీలు తెలంగాణ మంజీరా పరీవాహక గ్రామాలను ఎడారిగా మారుస్తున్నాయి. హద్దులు దాటి జరుపుతున్న ఇసుక తవ్వకాలు మంజీరమ్మ తలాపున ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు, బోరుబావులు వట్టిపోయేలా చేస్తున్నాయి. పంట పొలాలలో ఉన్నటువంటి బోర్లలో నీటి సామర్థ్యం తగ్గిపోవడంతో మంజీరా రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలకు కళ్లెం వేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కదలిక లేకపోవడంతో వారు ఏమీ చేయలేక గొల్లుమంటున్నారు. అధికారులే కాదు ప్రజాప్రతినిధులు సైతం మరాఠా క్వారీల నిర్వాకంపై నోరుమెదపక పోవడంతో మాకెవరు దిక్కు అంటూ రైతులు ఉసూరుమంటున్నారు. తెలంగాణ, మహారాష్టల్ర నడుమ ఉన్నటువంటి మంజీరా నదిలో రెండు రాష్ట్రాలకు సమాన వాటా ఉన్నప్పటికీ మరాఠా క్వారీల దోపిడీ దర్జాగా సాగుతోంది. హద్దులతో సంబంధం లేకుండా ప్రతిరోజు లక్షలాది రూపాయల విలువ చేసే ఇసుకను తోడేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వలన తెలంగాణ రాష్ట్రంలోని మంజీరా పరీవాహక గ్రామాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పంట పొలాల కోసం ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు ప్రమాదం ముంచుకొస్తోంది. భూగర్భ జలా లు ఇంకిపోయి బోర్లు వట్టిపోతుండటంతో రైతులు ఆందోళనతో తల్లడిల్లి పోతున్నారు. మరాఠా దోపిడీ తమను నట్టేట ముంచుతోందని మంజీరా రైతులు గొల్లుమంటున్నా మరాఠా దోపిడీ గురించి పట్టించుకునే వారు కరవయ్యారు. క్వారీల నిర్వాహకులు చేస్తున్న దాదాగిరి వలన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలిసినా అధికారులు మంజీరా వైపు కనీసం కనె్నత్తి కూడా చూడక పోవడం అనేక విమర్శలకు దారి తీస్తోంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంజీరా నదిలో ప్రస్తుతం మూడు చోట్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మరాఠా సర్కారు ఇచ్చిన అనుమతులతో మహారాష్టల్రోని ఏస్గి, బోలేగాం, సగ్రోలి గ్రామాల వద్ద ఇసుక తవ్వకాల కోసం క్వారీలు వెలిశాయి. ఈ క్వారీల నిర్వాహకులు మంజీరా నదిలో సరిహద్దులతో సంబంధం లేకుండా తెలంగాణ భూభాగంలోనికి చొచ్చుకుని వచ్చి దర్జాగా తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలలో ఇసుకను తోడేస్తూ ఓవర్‌లోడ్‌లతో తరలిస్తున్నా ఈ లారీలను తనిఖీలు చేసే వారు లేకుండాపోయారు. అలాగే క్వారీల వద్దకు వచ్చి హద్దులను పరిశీలించిన వారు కరవయ్యారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి సరిహద్దులో ఉన్నటువంటి బోధన్, కోటగిరి మండలాల తహశీల్దార్‌లు కార్యాలయాల నుండి క్వారీల వద్దకు వెళ్లగానే అక్కడి మిషన్‌లు మహారాష్టక్రు తరలిపోతున్నాయి. దాంతో వారు కూడా ఏమీ చేయలేక స్తబ్దుగా ఉంటున్నారు. ఈ అక్రమ తవ్వకాలు జరుగకుండా ఉండాలంటే మంజీరాలో సర్వేలు జరగాలని, అలాగే ఇక్కడ పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని సరిహద్దు గ్రామాల తహశీల్దార్‌లు జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపారు. కానీ ఉన్నత స్థాయి నుండి, మహారాష్ట్ర అధికారుల నుండి స్పందన కనిపించక పోవడంతో క్షేత్ర స్థాయి అధికారులు కూడా చేతులెత్తేయాల్సి వస్తోంది. మంజీరా నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాల రైతుల పంటపొలాల కోసం సాలూరా వద్ద పదహారు వందల ఎకరాలకు సాగునీళ్లు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అలాగే 23 గ్రామాలకు నీటిని అందించే మందర్న డీ ఫ్లోరైడ్ పథకానికి, కారేగాం, సుంకిని ఎత్తిపోతల పథకాలకు కూడా ఈ మరాఠా క్వారీల వలన ప్రమాదం ముంచుకొస్తోంది. సరిహద్దు గ్రామాలకు సాగునీరు, తాగునీటి ప్రమాదం ఉందని తెలిసినా అధికార యంత్రాంగంలో స్పందన కనిపించక పోవడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. మంజీరా నదిలోని ఇసుక నిలువలను మరాఠా క్వారీల నిర్వాహకులు తమ ఆస్తిలా భావిస్తున్నా తెలంగాణ సర్కారు వౌనాన్ని వీడకపోవడం నిర్వాహకులకు మరింత అవకాశాన్నిచ్చినట్టు కనిపిస్తోంది. సర్కారు వౌనాన్ని తమకు అనువుగా మలుచుకుని తమ అక్రమ తవ్వకాలను యధేచ్ఛగా సాగిస్తున్నారని తెలుస్తోంది.
ఇరవై రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మంజీరా వైపు కనె్నత్తి చూడక పోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం నుంటి నీటిని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ సర్వశక్తులొడ్డుతుంటే అధికార యంత్రాంగం కళ్లెదుటే జరుగుతున్న మంజీరా ఇసుక దోపిడీకి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. గతేడాది కూడా ఈ విధమైన దోపిడీ జరిగినా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మరాఠా దోపిడీ యధావిధిగా కొనసాగుతోంది.