తెలంగాణ

అమాయకులకు సైబర్ నేరగాళ్ల వల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అదీ ఇదీ అని తేడా లేదు, అక్షరాస్యుడు, నిరక్షరాస్యుడు అనే భేదం అసలే లేదు, ఎక్కడ వీలు దొరికితే అక్కడ మోసం చేస్తున్నారు. ఏదో దేశంలో ఉంటూ ఎక్కడి వారినో టార్గెట్ చేస్తూ వ్యక్తులను, బ్యాంకులను, చివరకు పాత వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనే, విక్రయించే ఆసక్తి చూపే వారిని సైతం వదలకుండా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. పాత వస్తువులు విక్రయించే కొన్ని పేరొందిన ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం వెబ్‌సైట్లలో తప్పుడు పోస్టింగ్స్ పెడుతూ, తక్కువ ధరను ప్రకటించి కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. మరో కోణంలో అమ్మే వ్యక్తి నిజమైతే కొనే వాళ్లు మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో కారు, లాప్‌టాప్, ఖరీదైన మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, ఫర్నిచర్, మోటారు సైకిళ్లు ఇలా ఒకటేంటి అన్నీ సెకండ్ హేండ్ వస్తువులను విక్రయించుకోవాలంటే ఈ వెబ్‌సైట్ల వేదికగా సౌకర్యం బాగుంది. అయితే ఆ వెబ్‌సైట్లు వాస్తవానికి బాగానే పని చేస్తున్నా, దీన్ని ఆసరగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలతో సైబర్ నేరగాళ్లు తెగబడుతూ అమాయకులను బుట్టలో వేసుకుని దోచుకుంటున్నారు. ఇలాంటి మోసాలు గత ఏడాది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 10 కేసులు వరకు నమోదైతే, ఈ ఏడాది నాలుగైదు నెలల్లోనే పది కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే జరుగుతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని వెబ్‌సైట్లలో పోస్టింగ్స్ పెడితే ఆశపడితే భంగపాటు తప్పదంటున్నారు. ఓ మహిళ తన వద్ద ఉన్న ఒక వస్తువును ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడితే ఒక చోట నుంచి ఒక వ్యక్తి స్పందించి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ స్వీకరించిన మహిళ తాను ఆ వస్తువుకు కోడ్ చేసిన మొత్తం వివరాలు చెప్పింది. దీంతో ఈ వస్తువు తనకు కాదని, తన సోదరికి కావాలంటూ చెప్పి ఇప్పుడే మీకు డబ్బు బదిలీ చేస్తానని చెప్పడంతో ఆ మహిళ సరేనని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ వస్తువు ఖరీదు రూ.3500 అయితే రూ.13,500 నగదు బదిలీ చేసినట్లు విక్రయించే మహిళ సెల్‌కు మెసేజ్ పంపించాడు. ఆ వెంటనే అతను మళ్లీ ఫోన్ చేసి పొరపాటున తన తల్లికి పంపించాల్సిన మొత్తం రూ.13,500 మీకు పంపించానని చెప్పాడు. మీకు రావాల్సిన రూ.3500 మినహాయించుకుని నేను చెప్పే పేటిఎం అక్కౌంట్‌కు సంబంధిత ఫోన్ నెంబర్ ద్వారా మిగిలిన 10 వేలు వాపస్ పంపించాలని చాలా దీనంగా వేడుకున్నాడు. తన అక్కౌంట్‌లో రూ.13,500 క్రెడిట్ అయినట్లు మెసేజ్ రావడంతో నిజమేనని భ్రమించి అతను చెప్పిన పేటిఎం అక్కౌంట్‌కు నగదును బదిలీ చేసింది. ఆ తర్వాత తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఆ మొత్తం అసలు క్రెడిట్ కానేలేదు. మోసపోయినట్లు గ్రహించిన ఆ మహిళ వెంటనే పోలీసులను సంప్రదించడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతను పంపిన మెసేజ్ ఫేక్ అని తెలిసేలోగా డబ్బు తరలిపోయింది. ఇంతేకాదు శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ఖరీదైన కారు తక్కువ రేటుకు అమ్మకానికి ఉందని, ఆ కారు తనదేనని ఆన్‌లైన్ వేదికగా పోస్టింగ్ పెట్టాడు. ఎక్కడో విదేశాల్లో ఉండి ఆ పోస్టింగ్ పెట్టాడు. ఒక వ్యక్తి అ పోస్టింగ్‌కు స్పందించి కాల్ చేయడంతో తనను పరిచయం చేసుకుని ఆ వాహనం తాలూకు వివరాలను అన్నీ పంపించాడు. ఆ తర్వాత వినాశ్రయ అధికారులకు వాహనం రిలీజ్ చేయాలంటే డబ్బు చెల్లించాలని చెప్పాడు. ఇందుకు రూ.5 లక్షలు తమ అక్కౌంట్‌లో వేస్తే మిగిలింది తర్వాత చెల్లించవచ్చని చెప్పడంతో నమ్మి డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత అంతా నకిలీ అని తేలడంతో డబ్బు పోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా విదేశాల్లో ఉంటూ సైబర్ నేరగాళ్లు హల్‌చల్ చేస్తూ దోచుకుంటున్నారు. 2010-2015 మధ్య భారీగా సైబర్ నేరాలు హైదరాబాద్‌లో పెరుగుతూ వచ్చాయి. దేశంలో మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం సైబర్ నేరాల్లో మూడో స్ధానంలో ఉంది. ఎక్కువ సైబర్ నేరాలు ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇటీవల ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో కెమెరాలను అద్దెకు ఇస్తామన్న ప్రకటన చూసి స్వల్ప మొత్తంలో అడ్వాన్స్‌గా నగదు చెల్లించి లక్షల విలువైన బ్రాండెడ్ స్టిల్ కెమెరాలను తీసుకుని కొందరు పరారయ్యారు. ఆ షాప్ యజమానికి నకిలీ ఐడి కార్డులు అందించారు. ఇంకా నాణ్యత లేని వస్తువులను అమ్ముతున్నట్లు మరికొందరు పోస్టింగ్ పెట్టి ఆ తర్వాత కొనుగోలు చేసే వారిని మోసగిస్తున్నారు. దొంగిలించిన వస్తువులను సైతం అమ్మకానికి ఆన్‌లైన్‌లో పోస్టింగ్ పెట్టి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని తెలియక చాలా మంది కొన్న తర్వాత విచారణలో ఆ వస్తువు దొంగ వస్తువు అని తేలడంతో పోలీసులు విచారణ చేసి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా డబ్బూ పోయే, అటు కేసులోనూ ఇరుక్కున్న సందర్భాలూ ఉన్నాయి.