తెలంగాణ

తుమ్మిడిహెట్టే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 14: ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద కాదని వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలనే ఆలోచన చేయడం సరి కాదని సీనియర్ కాంగ్రెస్ నేత, సీఎల్పీ ఉప నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. తుమ్మిడిహెట్టిని వార్ధాకు తరలిస్తామనడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ధ్వజమెత్తారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే గ్య్రావిటీ ద్వారా సుందిళ్ల వరకు నీరు తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు. శనివారం సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం వార్ధాను ముందుకు తీసుకువచ్చిందని ఆరోపించారు. వార్ధా వద్ద బ్యారేజీ నిర్మిస్తే.. ఇక్కడ కేవలం 60 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంటుందని, అదే పెన్‌గంగాలో 160 టీఎంసీలు, తుమ్మిడిహెట్టి వద్ద 360 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహెట్టి ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో ప్రయోజనం లేదనే విషయాన్ని తెలియజేస్తున్న క్రమంలో ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వార్ధాను తెరపైకి తీసుకువచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలపై రూ.30వేల కోట్ల భారం పడుతుందని ఆరోపించారు. ఈ చర్యలపై కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కోసం పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తుందని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి లభ్యత కేవలం వర్షాకాలంలోనే ఉంటుందని, అదే తుమ్మిడిహెట్టి వద్ద రెండుమూడు నెలలు మినహా ఎప్పుడూ నీటి లభ్యత ఉంటుందని అన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు పర్యాటక కేంద్రాలుగా మాత్రమే పనికి వస్తాయని, తెలంగాణకు ఈ రెండు బ్యారేజీలు గుదిబండ కానున్నాయని విమర్శించారు. ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ పనులు కొనసాగిస్తే రెండేళ్ల క్రితమే పూర్తయి రైతులకు ప్రయోజనం లభించేదని అన్నారు.
మేడారం రిజర్వాయర్ ఎత్తు పెంచడంలో జరిగిన జాప్యం మూలంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు పంటలకు నీరందకుండా పోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, కార్పొరేటర్ గందె మాధవి పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్పీ ఉప నేత జీవన్‌రెడ్డి