తెలంగాణ

వార్దా బ్యారేజి వైపే సర్కారు మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 22: ప్రాణహిత ప్రాజెక్టు కోసం తుమ్మడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీ ప్రాంతాన్ని మార్చి వార్దా నదిపైనే నిర్మించేందుకు సర్కారు సర్వసన్నద్ధమవుతోంది. ఈ దిశగానే సాగునీటి నిపుణులు, ఇంజనీర్లు రీడిజైనింగ్ పేరిట వార్దా బ్యారేజీ నిర్మాణం కోసం వడి వడిగా సర్వే నిర్వహించి, డీపీఆర్ తయారీ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌కు అప్పగించిన విషయం విదితమే. ఇప్పటికే వార్దాపై బ్యారేజీ నిర్మాణానికి మొగ్గుచూపుతున్న ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో డీపీఆర్ నివేదిక రాగానే టెండర్లు పిలిచి ఏడాది గడువుతో 36 గేట్లతో వార్దావద్ద బ్యారేజీ నిర్మించి, గతంలో కుదిరిన ఒప్పందం మేరకు ఆదిలాబాద్ జిల్లాకు 20 టీఎంసీలతో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇరిగేషన్ అధికారులకు వౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2008లో ఉమ్మడి ప్రభు త్వ హయంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కోసం తుమ్మడిహెట్టి వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ వరకు సాగునీరు తాగునీరందించాలని నిర్ణయించిన విషయం విదితమే. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతలను తెరపైకి తీసుకురావడంతో ప్రాణహిత ఆనకట్ట కథ అటకెక్కింది. తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత 160 టీఎంసీలు ఉంటే కాంగ్రెస్ హయంలో ప్రతిపాదించిన ప్రాణహితను రాజకీయ దురుద్దేశంతోనే బ్యారేజీ స్థలాన్ని మార్చి 150 మీటర్ల దూరంలో నీటి నిల్వ తక్కువగా ఉన్న వార్దానదికి మార్చారని విపక్షాలతో పాటు జలసాధన సమితి నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా రెండు నదులు కలిసే ప్రతిపాదిత ప్రాణహిత నుండి 140 టీఎంసీల నీటిని కాళేశ్వరానికి మళ్ళించేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2008లో ప్రాణహిత బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు 2లక్షల ఎకరాల ఆయకట్టు కోసం రూ.1919 కోట్లు వ్యయమవుతుందని నిర్దారించారు. పైగా 20 టీఎంసీల బ్యారేజీ కోసం 102 గేట్లు నిర్మించడం తలకు మించిన భారంగా మారుతుందని ప్రభుత్వం భావించి వార్దా నదిపైనే రూ. 700 కోట్ల అంచనాతో 36 గేట్లు బిగించి బ్యారేజీ నిర్మించవచ్చని, దీంతో ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే లైడార్ సర్వే ప్రకారం వార్దాపైనే బ్యారేజీ నిర్మాణానికి సర్కారు మొగ్గుచూపుతుండగా రెండు, మూడు రోజుల్లో డీపీఆర్ నివేదిక అనంతరం ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వార్దా బ్యారేజీ వల్ల ముంపు కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదిలోగా పనులు పూర్తిచేసి ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతామని ఎస్ ఈ విష్ణు ప్రసాద్ ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ వార్దా బ్యారేజీ నిర్మిస్తే 35 గేట్లతో నిర్మాణ భారం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై అపోహలు, అందోళనలు అవసరం లేదని, 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రాణహిత పేరిట రూ. 900 కోట్లు వృథా
2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తుమ్మడిహెట్టి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కోసం నాలుగేళ్ళలో కాలువల నిర్మాణం, సాంకేతిక పరమైన సర్వే ఇతరత్రా పనుల కోసం రూ.900 కోట్లు ఖర్చుచేసింది. పరిహారం కోసం ఎకరానికి రూ.లక్షా 27వేల చొప్పున రైతులకు కేటాయించారు. తుమ్మడిహెట్టి చింతలమానెపల్లి, కర్జెల్లి వరకు, సలుగుపల్లి నెనె్నల మైలారం వరకూ నాలుగు ప్యాకేజీలుగా విభజించి 69.5 కి.మీటర్ల మేర కాలువల తవ్వకం పనులు పూర్తయ్యాయి.
కాని తాజాగా వార్దా ప్రాజెక్టు తెరపైకి రావడంతో ఈ కాలువలను తిరిగి ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. 5 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతుతో కాలువల నిర్మా ణం చేపట్టగా వర్షాకాలంలో కాలువల్లో మట్టిపూడుకుపోయి నీటి నిల్వతో రైతులు చేపలు పడుతున్నారు.
చిత్రం..వార్దానదిపై నిర్మించతలపెట్టిన బ్యారేజి ఊహాచిత్రం