తెలంగాణ

అజ్ఞాతంలోనే సంజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 11: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మేయర్, రాజ్యసభ్య సభ్యుడు డీ. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ గడిచిన పది రోజుల నుండి అజ్ఞాతంలోనే ఉన్నారు. శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఈ నెల 3వ తేదీన స్థానిక నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంజయ్‌పై నిర్భయ చట్టం సహా ఐపీసీ 354, 354(ఏ), 342, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, కేసులు నమోదైన రోజు మధ్యాహ్నం నుండి సంజయ్ తన ఆచూకీ తెలియనివ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు నాలుగు బృందాలచే గాలింపులు జరుపుతున్నారు. అయితే, రహస్య ప్రాంతంలో తలదాచుకుంటున్న సంజయ్ అరెస్టు కాకుండా ఉండేందుకు తన న్యాయవాది ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయించారు. తనపై తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన కేసును కొట్టివేయాల్సిందిగా ఆదేశించాలని కోరారు. కానీ, న్యాయస్థానం అందుకు సమ్మతించకుండా సంజయ్ పిటిషన్‌ను కొట్టివేసింది. అదే సమయంలో విచారణ నిమిత్తం ముందుగా నోటీసులు జారీ చేయాలని పోలీసులకు సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ, ఈ నెల 12వ తేదీలోగా విచారణ నిమిత్తం హాజరుకావాలని సీఆర్‌పీసీ 41(ఏ) సెక్షన్ కింద పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆయన అజ్ఞాతంలో ఉం డడంతో జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లి నోటీసులు అతికించారు. ఇలావుంటే, ఇప్పటికే నిర్భయ సహా, మరో ఐదు సెక్షన్ల కింద నమోదైన కేసులో పోలీసులు తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును కూడా జత చేసినట్టు తెలిసింది. దీంతో సంజయ్‌పై నమోదైన కేసు మరింతగా బలపడినట్లయ్యిందని భావిస్తున్నారు.
కాగా, సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి పోలీసు కేసు నమోదు కావడం స్థానికంగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనప్పటికీ, ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు డీఎస్ నామమాత్రంగానైనా స్పందించకపోవడం విశేషం. తెర వెనుకే ఉండి తనయుడిపై పడిన మచ్చను ఎలాగైనా చెరిపివేయాలనే భావనతో డీఎస్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ పర్యటనకు హాజరైన కేసీఆర్‌తో హస్తినలోనే డీఎస్ భేటీ అయ్యి సంజయ్‌పై నమోదైన కేసు విషయమై చర్చించినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏమేరకు వాస్తవం ఉందన్న పక్కనబెడితే, సంజయ్‌ను అరెస్టు చేయాలంటూ విద్యార్థి సంఘాలు, ప్రధాన పార్టీల అనుబంధ సంస్థల నుండి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం సహా వామపక్ష సంఘాలు సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన చాటగా, అతనిని తక్షణమే అరెస్టు చేయాలంటూ తాజాగా బీజేవైఎం, ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. సీపీని కలిసి వినతిపత్రాలు కూడా అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సంజ య్ అజ్ఞాతాన్ని వీడి తనంతట తానుగా పోలీసుల ఎదుటకు వచ్చి విచారణకు సహకరిస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. నిర్భయ, అట్రాసిటీ సహా ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం, యువతులంతా స్వయంగా హోమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి లైంగిక వేధింపుల గురించి వివరించడం, ఆయన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు తక్షణ విచారణకు శ్రీకారం చుట్టడం వంటి పరిణామాలను బట్టి చూస్తే సంజయ్ విచారణ కోసం హాజరైన వెంటనే అతనిని అరెస్టు చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే సంజయ్ అజ్ఞాతాన్ని వీడడం లేదని భావిస్తున్నారు. మొత్తం మీద హైకోర్టు ఆదేశాలతో పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేసిన తరుణంలో సంజయ్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతున్నది.

చిత్రం..నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్