తెలంగాణ

ఏకధాటిగా వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 20: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రెండు రోజుల క్రితమే కురిసిన కుంభవృష్టికి అంతరాష్ట్ర వంతెనలు, రహదారులు తెగిపోగా సోమవారం కురిసిన భారీ వర్షానికి వృద్ధురాలు మృతి చెందగా మరో ఇద్దరు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లాలో 8 సెం.మీ వర్షపాతం నమోదుకాగా కాగజ్‌నగర్ డివిజన్‌లో ఉదయం నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో వేలాది ఎకరాల్లో వేసిన పంటలు నీటమునిగి రైతుల ఆశల సౌధాన్ని కుప్పకూల్చాయి. మరోవైపు ఎగువ మహారాష్టల్రో కురుస్తున్న వర్షాలు తోడు కావడంతో పెన్‌గంగా, ప్రాణహిత, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. పెన్‌గంగా, ప్రాణహిత నదీ తీరంలోని బెజ్జూర్, కౌటాల, బేల, జైనథ్, సిర్పూర్‌టి మండలాల్లో 45 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వంతెనల పైనుండి వరద నీరు ప్రవహించడంతో బెజ్జూర్‌పెంచికల్ పేట మండలాలకు సోమవారం పూర్తిగా రవాణా సంబంధాలు తెగిపోయాయి. బెజ్జూర్ మండలంలోని ఎల్కపల్లిబి గ్రామంలో పర్జానబేగం (30) అనే గర్భిణి ప్రసవవేదన పడుతూ 108 సిబ్బంది స్పందించకపోవడంతో ఆటోలో అతికష్టం మీద తీవ్ర రక్తస్రావంతో బెజ్జూర్ పిహెచ్‌సికి వెళ్ళగా అక్కడ కూడా వైద్యం అందలేదు. అక్కడి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యంలోనే మృతి చెందింది. రెండు రోజుల క్రితం సులుగుపల్లిలో వైద్యం అందక బొద్దెన సరిత (32) అనే గర్భిణి మృతి చెందిన సంఘటన విదితమే. ఇదిలా ఉంటే సోమవారం జన్నారం మండలం చింతలపల్లి గ్రామంలో భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోగా వృద్ధురాలు లక్ష్మిదేవి (60) తీవ్ర గాయాలతో మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. తలమడుగు మండలంలోని లక్ష్మిపూర్‌లో టేకం కృష్ణవేణి అనే మూడేళ్ళ చిన్నారి డయేరియా వ్యాధి తో మృతి చెందగా, ఇదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు డయేరియా సోకి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాలు, వరదలకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల 10వేల ఎకరాలు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఆదిలాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లోనే అత్యధికంగా పంట నష్టం సంభవించడం గమనార్హం. జన్నారం మండలం ఇందన్‌పల్లి వద్ద అప్రోచ్ రోడ్డు తెగిపోవడంతో కరీంనగర్ జిల్లాకు రాకపోకలు నిలిచిపోగా బెజ్జూర్, కౌటాల, సిర్పూర్‌టి, దహెగాం, జైనథ్, బేల, సిర్పూర్‌యు, నార్నూర్ మండలాల్లోని 65 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పెంచికల్‌పేట్ మండలంలో వందలాది ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఉట్నూరు మండలంలోని శాంతినగర్ జలదిగ్బంధంలో చిక్కుకుపోగా సిర్పూర్‌యు మండలంలోని జిర్లఘాట్ వాగు ఉప్పొంగడంతో 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే జిల్లా పోలీసు శాఖ వరదల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించగా 400 మంది సిబ్బందిని వరద సహాయక చర్యల బాధ్యతలు అప్పజెప్పామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు. బాధితుల సహాయార్థం పోలీసు సిబ్బంది రూ.4లక్షల విరాళాన్ని అందించినట్లు ఎస్పీ తెలిపారు. ఎల్లంపల్లి, కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చిచేరడంతో గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు వదిలారు. మంచిర్యాల జిల్లా సింగరేణి కోల్‌బెల్ట్ పరిధిలోని కళ్యాణఖని, రామకృష్ణపూర్, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోలేటి, ఉపరితల గనుల్లో భారీగా వరద నీరు చేరడంతో 16వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

చిత్రాలు..*బాసర వద్ద సోమవారం సాయంత్రం ఉరకలు వేస్తున్న గోదావరి,
*బెజ్జూర్ మండలం ఎల్కపల్లిలో వైద్యం అందక మృతి చెందిన గర్భిణి ఫర్జాన, *జన్నారం మండలం చింతగూడలో భారీ వర్షానికి ఇల్లు కూలిన దృశ్యం