తెలంగాణ

‘ముళ్ల’బాటే అయినా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 28: అది ముళ్ల బాటే అని తెలిసినా.. గల్ఫ్ పయనాలు తప్పడం లేదు. అరబ్ దేశాలు నరకయాతనలు పెడుతున్నా.. కటకటాల్లోకి నెట్టుతున్నా... వలసలు ఆగకపోగా, ఈ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఓవైపు కరవు, మరోవైపు ఉపాధి లేమి వెరసి నిరుద్యోగులు గల్ఫ్ దేశాలే ప్రత్యామ్నాయ ఉపాధి కేంద్రాలుగా భావిస్తూ ఆ వైపునకు అడుగులేస్తున్నారు. దీనికితోడు కుటుంబ అవసరాల కోసం అప్పు చేద్దామన్నా పల్లెల్లో అప్పు దొరకని పరిస్థితి. అదే దుబాయో, మస్కటో వెళ్తున్నారంటే అప్పు అడగడమే ఆలస్యం... లక్షల కొద్దీ అప్పులిస్తుండటంతో మెజారిటీ నిరుద్యోగులు ‘గల్ఫ్’ అనే ఆశల దారిలో అంతులేని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లడమంటే గొప్పగా భావిస్తుండటం కూడా గల్ఫ్ పయనాలకు కారణం కాగా, ఒక్కసారైనా గల్ఫ్ దేశాలకు వెళ్ళోస్తే లక్షలు సంపాదించవచ్చన్న మోజు, ఆశ కూడా దీనికితోడైంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి ఏటా వేల సంఖ్యలో నిరుద్యోగులు దుబాయ్, ఒమన్, రియాద్, సౌది అరేబియా, మస్కట్, బెహరాన్, కువైట్, ఇరాక్, కతార్, అప్ఘనిస్తాన్ తదితర గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన పది లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతుండగా, ఇందులో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వెళ్లిన వారు ఎక్కువగా ఉన్నారు. నిత్యం ఈ జిల్లాల నుంచి 150 నుంచి 200 మంది దాకా గల్ఫ్ దేశాలకు తరలివెళ్తున్నట్లు ఏజెంట్ల ద్వారా తెలుస్తోంది. అయితే, ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి అందినచోటల్లా అప్పులుచేసి కన్న వారిని, ఉన్న ఊరిని వదిలి గల్ఫ్ దారిపడితే, అక్కడ పనె్నండు గంటలు కష్టపడ్డ చాలిచాలని వేతనాలు లభిస్తుండటంతో గ్రామాల్లో చేసిన అప్పులు వారి కళ్లముందు కదలాడుతుంటే మనోళ్లు చేసేదేమిలేక కడుపుమాడ్చుకుని మరీ పనిచేస్తూ ప్రత్యక్ష నరకమంటే ఏలా ఉంటుందో ప్రత్యక్షంగా చవిచూస్తున్నారు. ఇకపోతే కలివెళ్ళి (రహస్యజీవనం) పద్ధతిలో పనిచేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయం. తినేందుకు తిండిలేక, చేసేందుకు పనిలేక దిక్కుతోచని స్థితిలో పార్కులు, చెట్లే అవాసాలుగా చేసుకుని దుర్భర పరిస్థితుల మధ్య గడుపుతున్నారు. అక్కడి కఠిన నిబంధనలు కఠినతరం కాగా, వాటిని తట్టుకోలేక కొందరు ఇంటి దారిపట్టిన వారు ఉండగా, మార్గం లేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడిన వారు ఉన్నారు. పనికి వెళుతూ ప్రమాదాల బారినపడి మృత్యువాత పడ్డ వారు ఉన్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అనేకమంది మరణ వార్తలు విన్నాం. అక్కడికెళ్లి ఆదృశ్యమైపోతున్న వారి ఉదంతాలు విన్నాం. ఇంకా వింటూనే ఉన్నాం. దీనికంతటికీ నకిలీ ఏజెన్సీలే ప్రధాన కారణమనే వాదన ఉంది. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారం 1500పైచిలుకు మంది లైసెన్సులు కలిగిన ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తుండగా, తెలంగాణలో లైసెన్సులు కలిగిన ఏజెంట్లు 35మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు లైసెన్సులు లేని సబ్ ఏజెంట్లు ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుకుంటున్న నకిలీ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు పలు రకాల (విసిట్, కంపెనీ, ఎంప్లాయిమెంట్) వీసాలను అంటగడుతూ వేల మందిని గల్ఫ్ దేశాలకు పంపుతుండగా, అక్కడ వారు అడుగుపెట్టడంతోనే కష్టాలు మొదలు. సుమారు 60శాతం వరకు విసిట్, టూరిస్ట్, ఆజాద్ వీసాలపైనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 40శాతం మాత్రమే రెగ్యులర్ వీసాలపై వెళ్తున్నట్లు సమాచారం. రెగ్యులర్ వీసాలపై వెళ్తున్న వారు మినహా మిగతా వీసాలపై వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. విసిట్, కలివెళ్లి వీసాలపై వెళ్లే వారు ఏయిర్‌పోర్టులో దిగగానే ఎవరికి వారు తమ ఉనికి అక్కడి అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ భవన నిర్మాణ కూలీలుగా, ఒంటెల కాపర్లుగా, అరబ్ షేక్‌ల ఇళ్ళల్లో పనివారిగా చాలిచాలని వేతనాలతో రహస్య జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వీసాలపై వెళ్ళే వారికి ఉపాధి కల్పిస్తున్న యాజమానులు వారి పాస్‌పోర్టులను లాక్కొని ఇష్టమొచ్చినంత కాలం పనిచేయించుకుంటూ వేతనాలను కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. వేతనాలు అడిగితే శారీరకంగా హింసించడం కూడా చేసేవారని జిల్లాకు వచ్చిన చాలామంది బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు కొకొల్లలు. అంతేకాకుండా చాలామంది అక్కడి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలైన వారు ఉన్నారు. చాలామంది అక్కడి జైళ్లల్లో మగ్గుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి నిబంధనలపై పూర్తిగా అవగాహన లేకపోవడం, దీనే్న అసరగా చేసుకున్న ఏజెంట్లు తప్పుదోవ పట్టించి పలు రకాల వీసాలతో అక్కడికి పంపుతుండటం లాంటి చర్యలతో గల్ఫ్ బాటపట్టిన వేలాది మంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరి ఆచూకీ తెలియక వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతూ ప్రభుత్వాలను వేడుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. గంపెడాశతో గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పరిస్థితులు అనుకూలించక స్వస్థలాలకు తిరిగి వచ్చిన వేలాది మంది గల్ఫ్ బాధితులు జీవచ్ఛవాల్లా బతుకులు వెళ్లదీస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడంతోపాటు గల్ఫ్ బాధితులను ఆదుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది.