తెలంగాణ

తొలి శాసనసభ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర తొలి శాసనసభ గురువారం రద్దు కావడంతో అటు అధికార టీఆర్‌ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల్లోనూ ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన మొదలైంది. శాసనసభ రద్దుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని మంత్రిమండలి చేసిన ఏకవాక్య తీర్మానానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆమోదించారు. ఫలితంగా శాసన సభతోపాటు టీఆర్‌ఎస్ సర్కారు కూడా రద్దయింది. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, మంత్రివర్గాన్ని కొనసాగాల్సిందిగా గవర్నర్ కోరగా అందుకు కేసీఆర్ అంగీకరించారు. ఆ వెంటనే, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌ను కలిసి గెజిట్ నోటిఫికేషన్‌ను అందజేసారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ఇలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చింది. తెలంగాణ తొలి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల 3 నెలల 4 రోజుల పాటు అధికారంలో కొనసాగింది. శాసనసభ రద్దయిన గురువారం రోజుననే 105 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించి, మరుసటి రోజు శుక్రవారం నాడే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నట్టు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం హుస్నాబాద్‌కు వెళ్లే మార్గంలో కోనాయిపల్లిలో వెంకటేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకుంటారు. ప్రతి ఎన్నికలకు ముందు ఇక్కడి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాకే ప్రచారాన్ని ప్రారంభించడం కేసీఆర్‌కు మొదటి నుంచి సెంటిమెంట్. హుస్నాబాద్‌లో జరిగే సభలో శాసనసభ రద్దుకుగల కారణాలను వివరించడంతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నారు.
అంతా ముహూర్తం ప్రకారమే..
‘మంచి సమయంలో చేస్తే అంతా మంచే జరుగుతుంది. చెడ్డ సమయంలో చేస్తే చెడ్డాగానే ఉంటుంది. అందుకే ఎన్నికల శంఖారావాన్ని శ్రావణమాసం శుక్రవారం ప్రశస్తమైన రోజైన 7వ తేదీన పూరించబోతున్నాను’ అని సీఎం కేసీఆర్ మీడియాకు తెలిపారు. 9వ తేదీన అమావాస్య, ఆ తర్వాత వచ్చే రోజులు పితృపక్షాలు...అవి మంచి రోజులు కావని, అందుకే, శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని మంచి ముహూర్తంగా ఎంచుకున్నట్టు కేసీఆర్ వివరించారు.

చిత్రం..తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు