తెలంగాణ

ద్రోహులను చేరదీసి ఉద్యమకారులపై వేటేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ ఉద్యమకారులను దూరంగా పెట్టి ద్రోహులను చేరదీస్తున్నారని టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజమెత్తారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల రాములు నాయక్ నిప్పులు చెరిగారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీఆర్‌ఎస్ ప్రకటించడం పట్ల రాములు నాయక్ తీవ్రంగా స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులు చేరారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఇప్పటికీ తెలంగాణకు గాంధీనే, అయితే ఆయన చుట్టూ గాడ్సేలు చేరారని విరుచుకుపడ్డారు. రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిజామాబాద్ జిల్లా నాయకులంతా పార్టీకి సిఫారసు చేసినా సస్పెండ్ చేయలేదన్నారు. పార్టీ అధిష్ఠానం, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని గుర్తు చేసారు. తాను గిరిజనుడిని అయినందుకే కనీసం వివరణ కూడా అడుగకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసారని ఆవేధన వ్యక్తం చేసారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినందుకు సస్పెన్స్ బహుమతిగా ఇచ్చారా? అని రాములు నాయక్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఏ రాయిని అడిగినా తన పేరు చెబుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన వారికి మంత్రి పదవులు ఇచ్చి అక్కున చేర్చుకున్నారన్నారు. ప్రగతిభవన్, పార్టీ, ప్రభుత్వం పూర్తిగా ద్రోహులకు నిలయంగా మారిందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తనను సస్పెండ్ చేసే నైతిక అర్హత ఉందా? అని నిలదీసారు. 2009 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి చెందినప్పుడు అధ్యక్ష పదవికి కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు ఉద్యమంలో ఆటు పోట్లు తప్పవని అండగా నిలిచిన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయని రాములు నాయక్ కంట తడిపెట్టారు. అధినేత కేసీఆర్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గర్వపడే వాడినని, అయితే ఒక పార్టీ ద్రోహి తనను సస్పెండ్ చేయడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఒకరు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిస్తే చర్యలు లేవు, తెలంగాణ ద్రోహి ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన కేటీఆర్‌పై చర్యలు ఉండవని ఆవేధన వ్యక్తం చేసారు. పార్టీలో అగ్రకులాలకు పెద్దపీట వేస్తున్నారని, ఇతరుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ పదవీవిరమణ చేస్తే ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసారని, అదే దళితడు ప్రదీప్ చంద్రా పదవీ విరమణ చేస్తే కనీసం వీడ్కోలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని రాములు నాయక్ ధ్వజమెత్తారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాములు నాయక్