తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: రాజకీయ పార్టీల పట్ల కక్షపూరిత ధోరణిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించడంతోనే కాంగ్రెస్- టీడీపీల మహా కూటమి సాధ్యమైందని టీటీడీపీ నేత ఎల్ రమణ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మహా కూటమిని కేసీఆర్ తక్కువ అంచనా వేస్తున్నారని, మహా కూటమి రానున్న ఎన్నికల్లో 80 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని అన్నారు. ఎన్నికల అవగాహనపై ఎలాంటి తొందర లేదని, కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నామని, అన్ని అంశాలపై ఏకాభిప్రాయం సాధిస్తున్నామని రమణ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐతో పాటు మరో పార్టీ మహాకూటమిలో చేరుతోందని, ఐదు పార్టీల పంచపాండవులు వంద మంది టీఆర్‌ఎస్ అభ్యర్ధులైన కౌరవులతో పోటీ జరుగుతోందని, ఈ పోటీలో ఎవరు గెలుస్తారో అందరికీ తెలుసని అన్నారు. హరీష్ వర్గానికి చెందిన అభ్యర్ధులకు టిక్కెట్లు ఇవ్వాల్సి వస్తుందని, ఆ వత్తిడిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఆతృతగా టిక్కెట్లను ప్రకటించారని, చెప్పారు. ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబునాయుడును అనవసరంగా లాగుతున్నారని, ఆయన ఆర్ధిక సాయం చేయబోతున్నారనే ప్రచారాన్ని టీఆర్‌ఎస్ చేస్తోందని, ఇదే నిజమైతే గతంలో టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసినపుడు టీఆర్‌ఎస్ ఏం ఇచ్చిందో, ఏం తీసుకుందో చెప్పాలని అన్నారు. టీఆర్‌ఎస్ ఒంటరి పోరు అని అంటున్నారని, అలాంటిది ఏమీ లేదని కుడివైపు బీజేపీని, ఎడమవైపు ఎంఐఎంను పెట్టుకుని టీఆర్‌ఎస్ ఎన్నికల బరిలోకి దిగిందని ఆరోపించారు. మహాకూటమి ఎందుకు ఏర్పాటైందో కింది స్థాయి క్యాడర్‌కు వివరించి చెబుతున్నామని అన్నారు. ఇపుడు చంద్రబాబును తిడుతున్న కేసీఆర్ ఒకపుడు స్వయంగా ఆయన నోటితోనే ప్రశంసించారని పేర్కొన్నారు. 2004 ఎన్నికలపుడు కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నపుడు కేసీఆర్ ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని రమణ నిలదీశారు. 2014లో సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్ ఆ తర్వాత రాక్షసి అన్నాడని, కేసీఆర్ ద్వంద్వ నీతిని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా నీతి నిజాయితీగా పనిచేస్తూ తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని చెప్పారు.