తెలంగాణ

అభివృద్ధిలో ఆదర్శం గజ్వేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, నవంబర్ 11: నిరాడంబరంగా ఈనెల 14న గజ్వేల్ నుండి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను నామినేషన్ వేస్తున్న క్రమంలో నియోజకవర్గం నుంచి కార్యకర్తలు ఎవరూ రావద్దని.. ఎన్నికల నిబంధనలు పాటించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
మళ్లీ టీఆర్‌ఎస్‌కే అధికారం దక్కనున్న దృష్ట్యా రానున్న కాలంలో గజ్వేల్‌ను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రాన్ని, గజ్వేల్‌ను అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే గజ్వేల్ అభివృద్ధిలో 20 సంవత్సరాల ముందుకు వెళ్లిందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో 75 శాతం పథకాలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచే రూపకల్పన చేసినట్లు వివరించారు. అభివృద్ధిలో గజ్వేల్, సిద్దిపేటకు పోటీ వస్తుందని, అభివృద్ధి ఆగిపోవాలని మంత్రి హరీష్‌రావు అనుకుంటున్నారని సీఎం ఆసక్తికరమైన తరహాలో మాట్లాడారు. రానున్న రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతివ్యక్తీ సొంత ఇల్లు లేకుండా ఉండకూడదని, అలాగే గజ్వేల్‌కు రైలు రావాలని అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి గుంటకూ సాగునీరురందిస్తామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మ ప్రాజెక్టును వచ్చే వర్షాకాలంలో నింపుతామన్నారు. గజ్వేల్ ప్రజలు మూడు పంటలు పండించే స్థాయికి ఎదగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కంటి వెలుగు పథకానికి ఎర్రవల్లి గ్రామమే కారణమని చెప్పారు. గజ్వేల్‌లో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి ఇంటికీ వంద శాతం సబ్సిడీపై పాడి గేదెలు ఇస్తామని అన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, తొలి దశలో గజ్వేల్‌లోనే ఏర్పాటు చేస్తానని తెలిపారు. పంట కాలనీలు కూడ మొదటగా గజ్వేల్‌లో ప్రారంభిస్తానన్నారు. గత ప్రభుత్వాలు చీకట్లో బాణం వేసినట్లు పాలన సాగించాయని విమర్శించారు. తన గెలుపు బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉన్నందున ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి భారీ మెజార్టీకి కృషి చేయాలని సూచించారు.
ఎన్నికల ముందు గజ్వేల్‌లో భారీ బహిరంగా సభ పెట్టుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, కర్నెప్రభాకర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకులు లక్ష్మీకాంతరావు, రాధాకృష్ణశర్మ, అయా మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరైన వారికి అభివాదం చేస్తున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్