ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరులో ముగిసిన ప్రజా సంకల్ప యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, జూన్ 5: బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో గత నెల 28న ఎన్‌టిఆర్ వర్ధంతి రోజు ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర చివరి మజిలీ నెల్లూరుకు ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటి ముందు సంకల్ప యాత్ర సభ్యులు ప్రదర్శన నిర్వహించి ఆయన కుటుంబ సభ్యులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ గత పది రోజులుగా ఈ యాత్ర రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల మీదుగా నెల్లూరుకు చేరుకుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే లక్ష్యంగా తాము ఈ యాత్ర చేపట్టామన్నారు. విభజనలో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో కళారూపాల ద్వారా ప్రజలకు ఈ యాత్రలో తెలియజేశామన్నారు. చంద్రబాబునాయుడు వంటి కార్యదీక్షాపరుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్యనాయుడి వంటి వ్యక్తి కేంద్రంలో ఉండగా ఈ హోదా తీసుకురావాలన్నదే తమ అభిమతంగా పేర్కొన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నదే తమ వాంఛగా ఆయన స్పష్టం చేశారు. అంతక్రితం వెంకయ్యనాయుడి నివాసం ఎదుట వారు కళాప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ప్రదర్శనలో పాల్గొన్న వారికి దుస్తులు పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘ ప్రతినిధులు మల్లికార్జున్, డాక్టర్ సునీల్, సిహెచ్ జాషువా, దినేష్ కృష్ణ, అనంతపురం కళాకారులు రమణయ్య ఆచారి, కాంతారావు, కె విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎదురుదాడి మానండి
టిడిపికి వైకాపా హితవు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శిస్తే హింసను ప్రేరేపించే విధంగా టిడిపినేతలు వ్యవహరించడం సిగ్గుచేటని వైకాపా అధికార ప్రతినిధి వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం వారు ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎడాపెడా హామీలను ఇచ్చారని, వాటిని అమలు చేయడం లేదన్నారు. ఆ హామీలను నెరవేర్చని నేతలను ఏమి చేయాలో మాత్రమే జగన్ చెప్పారన్నారు. అసెంబ్లీలోపల, వెలుపల జగన్‌ను ఇష్టం వచ్చినట్లు టిడిపి నేతలు దూషించారన్నారు. అనంతపురం, కదిరిలో జగన్ బహిరంగ సభల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలకు చంద్రబాబు జవాబు చెప్పాలని డిమండ్ చేశారు. వైకాపా కార్యకర్తలు ప్రజాస్వామ్య రీతిలో వ్యవహర్తిస్తున్నారన్నారు. పోలీసుల అండతో టిడిపి కార్యకర్తలు పెట్రేగి పోతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితులు క్షీణించాయన్నారు. ప్రతిపక్ష నేత సభలు నిర్వహిస్తే అధికార పార్టీ తన అనుచరులతో భగ్నం చేసేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తిలేదన్నారు. ఎదురుదాడి మాని ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు.
11 దేశాల్లో కూచిపూడి
యక్షగాన ప్రదర్శనలు
కూచిపూడి, జూన్ 5: కళలు, కళాకారులు ప్రపంచ శాంతి రాయబారులన్న మహాకవుల వాక్కులకు అద్దంపట్టేలా అమెరికాలోని ‘యుక్త’ ఆధ్వర్యాన కూచిపూడి నాట్యారామం, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘జయతే కూచిపూడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం వెంకట నాగచలపతి తెలిపారు. ఈ నెల 10న హైదరాబాద్ నుండి యుకె, యూరప్ ఫెస్టివల్స్‌లో కూచిపూడి యక్షగానాలు, సోలో డ్యాన్స్‌లు ప్రదర్శించేందుకు సంప్రదాయ కూచిపూడి నాట్య బృందం బయలుదేరుతున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు. ఈ నెల 12 నుండి 13 వరకు లండన్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, బర్మింగ్‌హామ్, జూరిచ్, ఇటలీ, నార్తరన్ ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.
ఈసందర్భంగా కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ సిద్ధేంద్ర విరచిత భామాకలాపం, వేదాల తిరునారాయణాచార్యులు తిరువక్కళ్లూరు గోపాలాచార్యులు విరచిత భక్తప్రహ్లాద యక్షగానాలను లండన్‌లోని ప్రముఖ మ్యూజియంలో ప్రదర్శన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా లండన్‌లోని ఎంపిలు, ఎమ్మెల్యేల కోరిక మేరకు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మన సంస్కృతిని ప్రోత్సహిద్దాం.. మన వారసత్వ కళలను కాపాడుకుందాం’.. అనే నినాదాలతో నాట్యరామ కమిటీ ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ పర్యవేక్షణలో ఆర్గనైజర్ కిళ్ళి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రోజుకు 3 గంటల వంతున సోలో డ్యాన్స్‌లు, యక్షగాన ప్రదర్శనలు ఆయా దేశాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. నాట్యక్షేత్రం కూచిపూడికి చెందిన 13 మంది యువ కళాకారులతో పాటు తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన డా. వనజా ఉదయ్, కినె్నర ఆర్ట్ అసోసియేషన్ నిర్వాహకురాలు డా. మద్దాల ఉషా గాయత్రి బృందాలు యక్షగానాలు, జానపద నృత్యాలు, బృంద నృత్య గానాలు ప్రదర్శిస్తారన్నారు. 13న లండన్‌లోని మ్యూజియంలో ముగింపు ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో కూచిపూడి గ్రామానికి చెందిన ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు, చింతా వెంకటరమణ, పసుమర్తి హరినాథశాస్ర్తీ, వెంపటి సత్యప్రసాద్, తాడేపల్లి సాయికృష్ణ, వేదాంతం కిరణ్, చిన్నారులు వేదాంతం చిన్మయి సింధూ, వేదాంతం హసితతో పాటు సంగీత కళాకారులు కె సూర్యనారాయణ, పాలపర్తి ఆంజనేయులు, ఎస్ కుమారబాబు పాల్గొంటారని ఆయన వివరించారు.

మరో రెండు రోజుల్లో
కేరళను తాకనున్న నైరుతి?
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 5: నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు శ్రీలంక తీరాన్ని దాదాపు తాకడంతో ఈనెల 7న లేదా 8న కేరళ తీరాన్ని తాకవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే వాతావరణం దాదాపు అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశాను ఆనుకుని ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చెదురు, మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కూడా ఉంది. గడచిన 24 గంటల్లో విశాఖ విమానాశ్రయంలో 53.1 మిల్లీమీటర్లు, అనకాపల్లిలో 44.6, శ్రీకాకుళం, టెక్కలిలో 24, విజయనగరంలో 31, పలాసలో 6.4, గుడివాడలో 32.2, తణుకులో 21.4, భీమవరం 26.2, తెనాలిలో 12.4 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కొండారెడ్డి బురుజుపై
జాతీయ జెండా ఎగిరేనా!
కేంద్ర అనుమతి కోసం మళ్లీ ప్రయత్నాలు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూన్ 5: కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజుపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకు వచ్చే ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు. కొండారెడ్డి బురుజుపై జాతీయ జెండాను ఎగురవేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు సుమారు అయిదేళ్ల క్రితం కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించి అందుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను పంపాల్సిందిగా కోరింది. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో విభజన ఉద్యమాలు తీవ్రం కావడంతో ఆ ఫైలు ఢిల్లీలోనే ఉండిపోయింది. చారిత్రాత్మక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై దేశంలోనే అత్యంత ఎత్తున భారీ జాతీయ జెండాను ఎగుర వేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి.మోహనరెడ్డి స్పందించి అధికారులతో సమావేశమై ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి కెఇ.కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్‌తో కలిసి సిఎం చంద్రబాబును కలిసి కేంద్రంతో చర్చించాలని కోరుతున్నామన్నారు. అవసరమైతే తామే ఢిల్లీ వెళ్లి ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను పూర్తి చేసి వీలైతే వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ ఆవిష్కరింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య సైతం స్పందించి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీలకు లేఖ రాస్తామని తెలిపారు. ఆ తరువాత కేంద్రం నుంచి అనుమతుల కోసం రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి అభ్యంతరాలను తెలుసుకుని అనుమతులు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. మరుగున పడిందనుకున్న జాతీయ జెండా వ్యవహారం ఇటీవల హైదరాబాద్‌లో అత్యంత ఎత్తు, పొడవు, వెడల్పులతో కూడిన జెండాను ఆవిష్కరించడంతో ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. నాయకులంతా ఒక్కటిగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే అనుమతులు సాధ్యమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.