తెలంగాణ

సృజనతోనే వ్యవసాయం లాభసాటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 9: సమాజాభివృద్ధిలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ అన్నారు. ఆదివారం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగం చేశారు. వ్యవసాయ విద్యను అభ్యసించిన మీరు కూడా సమాజంలో భాగమే అన్న భావనతో పనిచేస్తేనే రైతుల అభ్యున్నతి జరుగుతుందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేవలం మద్ధతు ధరలు పెంచడం ఒకటే సరిపోదని, నీటి యాజమాన్యం, పంటల మార్పిడి, పంటకోత అనంతరం నష్టాలను నివారించేందుకు స్టోరేజ్ సౌకర్యాలు పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లతోపాటు అవకాశాలను అందిపుచ్చుకొని సృజనాత్మక పద్ధతులలో ఆలోచించి రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత, ప్రజలకు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత కల్పించడమే కాకుండా పర్యావరణానికి హాని కలుగని పద్ధతులలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
పురుగుల మందులు, రసాయనిక ఎరువులు, విచక్షణా రహితంగా వాడటం వల్ల ఆరోగ్య భద్రత దెబ్బ తింటుందని, క్యాన్సర్ వంటి రోగాలు విజృంభిస్తున్నాయని, ఇది ప్రమాదకరమని అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి సమాజ వనరులను కాపాడాల్సిన అవసరం ఉందని, సమర్థ నీటి యాజమాన్యం కోసం జాతీయ నీటి విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను ఏయే అవసరాలకు ఎలా వినియోగించుకోవాలన్న ప్రణాళికలు ఉండాలన్నారు. ఔషధ మొక్కల పెంపకంపై దృష్టి నిలపాలన్నారు. పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం తొలగించేందుకు కృషి జరగాలని, దీనివల్ల గ్రామాల నుంచి ప్రజల వలసలు నిలువరించ వచ్చన్నారు. రైతులు పండించిన పంటలకు జోడింపువల్ల వారికి ఆదాయం పెంచే మార్గాలను కనుగొనాలని స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్న విద్యార్థులకు సూచించారు. సమాజ అవసరాలకు అనుగుణంగా పని చేయడానికి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నందుకు ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైనె్సస్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేందర్‌సింగ్ పరోడాకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే వ్యవసాయ రంగం సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా గుర్తింపు పొందిందన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం వ్యవసాయం ద్వారా సమాజంలో పేదరికం నిర్మూలనకు పూనుకోవాలన్నారు.
దేశంలో ఆకలి, దారిద్య్రం, అనారోగ్యం లేని సమాజ స్థాపనకు యువ శాస్తవ్రేత్తలు కృషి చేయాలని సూచించారు. రైతులకు మరింత మెరుగ్గా పరిశోధనా ఫలితాలు అందడం కోసం పరిశోధనా అంశాలను పునర్ వ్యవస్థీకరించు కోవాలని అన్నారు. వ్యవసాయ రంగంలో దిగుబడులు పెంచడమే కాకుండా కుటుంబ పోషణపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ విద్య ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని యువ శాస్తవ్రేత్తలు కింది స్థాయిలో సమాజ అభివృద్ధికి వినియోగించాలని అన్నారు. వ్యవసాయ విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు కల్పించే వారిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నవకల్పనలతో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. విభిన్న ఆలోచనలతోనే మంచి ఫలితాలు వస్తాయని, జీవితంలో కష్టపడనిదే విజయాలు సాధించలేమని అన్నారు. మహిళా సాధికారతతో కుటుంబ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వ్యవసాయ వర్సిటీని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలిపేందుకు వీసీ ప్రవీణ్‌రావు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వీసీ ప్రవీణ్‌రావు 2016-17 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో చేపట్టిన కార్యక్రమాల నివేదికను ఈ సందర్భంగా సమర్పించారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో చేపట్టిన సంస్కరణలను ఆయన వివరించారు. 5వ డీన్ల కమిటీ నివేదికను అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయం తమదే అన్నారు. విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించేందుకు, వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు. వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిన డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడాకు గౌరవ డాక్టరేట్‌ను అందించడం విశ్వవిద్యాలయానికి ఎంతో గర్వకారణమన్నారు. 2016-17 విద్యా సంవత్సరానికి గాను పీజీ, పీహెచ్‌డీకి చెందిన 162 మందికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన 584 మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్నారు. యూజీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మందికి బంగారు పతకాలు అందించారు. అలాగే బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐరెడ్ల వౌన్యరెడ్డి ఐదు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. బిటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఎం.మునిమారుతీ రాజు రెండు గోల్డ్‌మెడల్స్ అందుకున్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్‌తో పాటు డీన్‌లు, డైరెక్టర్లు, పాలకమండలి సభ్యులు, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.