తెలంగాణ

అమర వీరుల కుటుంబాలకు చెల్లని నియామక పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: అమర వీరుల కుటుంబాలకు చెల్లని నియామక పత్రాలు ఇచ్చారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆదిలాబాద్‌లో 27 మంది అమరవీరుల కుటుంబాలు ఆ నియామక పత్రాలతో అధికారుల వద్దకు వెళితే ఉద్యోగం లేదంటూ బయటకు పంపించారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులపై లోగడ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ అనేక మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకున్నదో శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమ కేసుల కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, చెల్లని నియామక పత్రాల కారణంగా అమర వీరుల కుటుంబాలకు అవమానం జరగడానికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసుల ఎత్తివేతపై అసెంబ్లీలో ప్రకటన చేసినా, ఇంత వరకు జివో విడుదల కాలేదని ఆయన తెలిపారు.

11 దేశాల్లో కూచిపూడి
యక్షగాన ప్రదర్శనలు
కూచిపూడి, జూన్ 5: కళలు, కళాకారులు ప్రపంచ శాంతి రాయబారులన్న మహాకవుల వాక్కులకు అద్దంపట్టేలా అమెరికాలోని ‘యుక్త’ ఆధ్వర్యాన కూచిపూడి నాట్యారామం, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘జయతే కూచిపూడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం వెంకట నాగచలపతి తెలిపారు. ఈ నెల 10న హైదరాబాద్ నుండి యుకె, యూరప్ ఫెస్టివల్స్‌లో కూచిపూడి యక్షగానాలు, సోలో డ్యాన్స్‌లు ప్రదర్శించేందుకు సంప్రదాయ కూచిపూడి నాట్య బృందం బయలుదేరుతున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు. ఈ నెల 12 నుండి 13 వరకు లండన్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, బర్మింగ్‌హామ్, జూరిచ్, ఇటలీ, నార్తరన్ ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.

గొడవలొద్దు
కాంగ్రెస్ నేతలకు షబ్బీర్ వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: పార్టీ నాయకులు గొడవ పడవద్దనీ, సహనంతో ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. పరస్పరం విమర్శలు చేసుకోవడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని, ప్రజల్లో చులకన అవుతామని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నదని, పార్టీలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కు ఉన్నదని, అయితే ఇలా బహిరంగంగా కాకుండా పార్టీ వేదికలపై లేదా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన సూచించారు. పార్టీకి నష్టం కలిగించేలా విమర్శలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను తదితరులను కోరారు. 2019 ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా పార్టీలో ప్రతి ఒక్కరూ పని చేయాలని షబ్బీర్ అలీ కోరారు.

రెండు రోజుల్లో కేరళకు రుతుపవనాలు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 5: నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు శ్రీలంక తీరాన్ని దాదాపు తాకడంతో ఈనెల 7న లేదా 8న కేరళ తీరాన్ని తాకవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే వాతావరణం దాదాపు అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశాను ఆనుకుని ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చెదురు, మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కూడా ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. గడచిన 24 గంటల్లో విశాఖ విమానాశ్రయంలో 53.1 మిల్లీమీటర్లు, అనకాపల్లిలో 44.6, శ్రీకాకుళం, టెక్కలిలో 24, విజయనగరంలో 31, పలాసలో 6.4, గుడివాడలో 32.2, తణుకులో 21.4, భీమవరం 26.2, తెనాలిలో 12.4 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.