తెలంగాణ

73 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో 73 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెముక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ పేర్కొంది. అభ్యర్ధులు తాము సమర్పించిన అఫిడవిట్లలో ఈ విషయాన్ని వారే అంగీకరించడం గమనార్హమని ఏడీఆర్ గురువారం నాడు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. తెలంగాణ శాసనసభకు కొత్తగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల అఫిడివిట్లు , ఇతర సమాచారాన్ని విశే్లషించినపుడు 73 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.
గత ఎన్నికల్లో (2014) 67 మంది మాత్రమే క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వారు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. 73 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని నివేదిక పేర్కొంది. ఐపీసీ 307 నమోదుచేయదగ్గ హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్నవారు ఏడుగురు ఉన్నారని, ముగ్గురు ఎమ్మెల్యేలు మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని నివేదిక వివరించింది. పార్టీల వారీ చూస్తే కేసులు ఎదుర్కొంటున్న వారిలో టీఆర్‌ఎస్ నుండి ఎన్నికైనవారు 50 మంది ఉన్నారు. 14 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు, ఆరుగురు ఎంఐఎం అభ్యర్ధులున్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే కేసులను ఎదుర్కొంటున్నట్టు వారే వెల్లడించారు. అయితే వీరిలో 34 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంఐఎం , ఒక టీడీపీ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికైన 119 మందిలో 106 మంది కోటీశ్వరులే. ఇందులో టీఆర్‌ఎస్ వారు 83 మంది కాగా, 14 మంది కాంగ్రెస్, ఏడుగురు ఎంఐఎం, ఒక టీడీపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. 119 మంది ఎమ్మేల్యేల సగటు ఆస్తి 7.70 కోట్లుగా ఉంది. పార్టీల పరంగా సగటును చూస్తే టీఆర్‌ఎస్ 14.64 కోట్లు, కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి 26.14 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి 10.84 కోట్లు ఉంది. గరిష్ట ఆస్తులు ప్రకటించిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (314 కోట్లు), మర్రి జనార్థనరెడ్డి (161 కోట్లు), కండ్ల ఉపేందర్‌రెడ్డి (91 కోట్లు ) ఉన్నారు. అతి తక్కువ ఆస్తులు ప్రకటించిన వారిలో సయ్యద్ అహ్మద్ పాషా 19 లక్షలు, రావి శంకర్ సుంకే 20 లక్షలు, ఆత్రం సక్కు 27 లక్షల ఆస్తులను ప్రకటించారు. ఎక్కువ అప్పులు ఉన్న వారి జాబితాలో కందల ఉపేందర్‌రెడ్డి 94 కోట్లు, మర్రి జనార్థనరెడ్డి 63 కోట్లు, దానం నాగేందర్ 40కోట్లు అప్పులు చూపించారు. ఆదాయపన్ను ఎక్కువగా చెల్లిస్తున్న వారిలో మర్రి జనార్ధనరెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. ఎంపికైన వారిలో 44 మంది ఇంటర్‌లోపు చదివిన వారే, మరో 69 మంది గ్రాడ్యూయేట్లు, పీజీ చేసిన వారున్నారు. ఒక ఎమ్మెల్యే మాత్రం కేవలం అక్షరాస్యుడిని మాత్రమేనని చెప్పారు. ఐదుగురు ఎమ్మేల్యేలు 31 నుండి 40 ఏళ్ల మధ్యవారు కాగా, 86 మంది 41 నుండి 60 ఏళ్ల ప్రాయం వారున్నారు. మరో 28 మంది 61 నుండి 80 ఏళ్ల ప్రాయం వారు ఉన్నారని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఆరుగురు మాత్రమే మహిళలు. గత శాసనసభలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో 75 మంది తిరిగి ఈసారి శాసనసభకు ఎన్నికయ్యారని ఏడీఆర్ బృందం సభ్యులు రాకేష్‌రెడ్డి దుబ్బుడు, మేజర్ జనరల్ అనిల్ వర్మ, ప్రొఫెసర్ జగ్‌దీప్ చొక్కర్, ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్ర్తీ వెల్లడించారు.