తెలంగాణ

ముంపు గోడు.. దేవుడెరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 9: వ్యవసాయం కోసం నీటి ప్రాజెక్టులు, ఉపాధి కోసం పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిన పథకాల్లో వేలాది ఎకరాల భూమి కనుమరుగు కానుండగా, ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారంపై అన్నదాతలు అలకపాన్పునెక్కారు. బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు రంగప్రవేశం చేయడంతో లాభం మాట దేవుడెరుగుకానీ ప్రభుత్వం మాత్రం పిసరంత కూడా స్పందించడం లేదు. గోదావరి జలాలను సాగునీటికి అందించడానికి మెదక్ జిల్లా తొగుట, కొండపాక మండలాల్లో నిర్మించతలపెట్టిన మల్లన్న సాగర్ సాగునీటి ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. అత్తమీది కోపం దుత్తమీద తీర్చుకున్నట్టుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న బాధితుల గోడును వినిపించేందుకు వెళ్లిన మీడియా సైతం ప్రతిపక్ష పార్టీ నేతలతో చీవాట్లు, దాడులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో సుమారు 40 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుండగా, నిమ్జ్‌లో పరిశ్రమల స్థాపన కోసం 12 వేల ఎకరాలకు పైచిలుకు భూ సేకరణ చేపడుతున్నారు. మంజీర నదిపై వంద సంవత్సరాలకుపైగా నిజాం ప్రభుత్వం నిర్మించిన ఘన్‌పూర్ ఆనకట్ట ఎత్తును పెంచుతుండడంతో ఘన్‌పూర్, రంగంపేట, సంగాయిపేట, కోనాపూర్, వై.మాందాపూర్ గ్రామాలకు చెందిన రైతుల భూములు ప్రాజెక్టులో మునిగిపోనున్నాయి. పాపన్నపేట మండలంలో నాగ్‌సాన్‌పల్లి, శేరిపల్లి, కోడుపాక గ్రామాలకు చెందిన రైతుల భూములు నీట మునిగిపోనున్నాయి. మరోవైపు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సంబంధించిన కాలువలను తవ్వనుండడంతో నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతుల భూములు తునాతునకలు కానుండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. నిమ్జ్‌లో ఇప్పటికే భూ సేకరణ చేపట్టి బాధిత రైతులకు ప్రభుత్వం నిర్ధారించిన మేరకు పరిహారం చెల్లించారు. అయితే మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులు ఉద్యమానికి దిగడంతో నిమ్జ్ భూ బాధితుల్లో కూడా కొత్త ఆశలు చిగురించాయి. దీంతో వారు కూడా ఉద్యమంలో గళం కలిపేందుకు సన్నద్ధమవుతున్నారు. కొండపాక మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో భూ సేకరణ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్థులు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టిన విషయం తెలిసిందే. బలవంతంగా రైతులను తీసుకువెళ్లారన్న నెపంతో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి సభ్యుడి ఇంటిపై గ్రామస్థులు దాడి చేసి ఫర్నిచర్, కారును ధ్వంసం చేసిన విషయం విదితమే. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలను దూషించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడున్న కెమెరామెన్లపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం పోలీసు కేసుల వరకు వెళ్లడంతో రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణాలో పాలన కొనసాగిస్తున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీకి భూముల ముంపు ఇరకాటంలోకి నెట్టుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు దిక్కులా భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వంపై పోరాటానికి దిగడంతో పరిస్థితి ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరాం సైతం ప్రభుత్వం చెల్లిస్తున్న భూ పరిహారంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే నర్మదా బచావో ఉద్యమనేత మేథాపట్కార్‌ను తీసుకువచ్చి రైతులతో ఉద్యమిస్తామంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం గమనార్హం. మెతుకుసీమలో బతుకుదెరువుకు బాటలు వేసుకునేందుకు వందలాది మంది రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తుండడం విశేషం.