తెలంగాణ

కొత్త జిల్లాలకు మంత్రులుండరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: మరో ఐదునెలల్లో కొత్త జిల్లాలు ఉనికి లోకి రానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లాలు పని చేస్తాయని ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు. జిల్లాలు ఏర్పడినా, కొన్ని జిల్లాలకు మంత్రులు లేని విచిత్రమైన పరిస్థితి ఏర్పడబోతోంది. జిల్లాలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేది జిల్లా మంత్రే. జిల్లా మంత్రికి జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయిస్తున్నారు. జిల్లా అభివృద్ధి సమావేశాలకు అధ్యక్షత వహించేది జిల్లా మంత్రులే. తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరినీ చేర్చుకునే పరిస్థితి లేదు. శాసన సభ్యుల సంఖ్యలో 15శాతానికి మించి మంత్రివర్గం ఉండకూడదనే నిబంధన మేరకు 119 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్న తెలంగాణలో మంత్రుల సంఖ్య 18మాత్రమే ఉండాలి. కొత్తగా 14 జిల్లాలు ఉనికిలోకి వస్తాయికానీ ఈ 14 జిల్లాలకు కొత్తగా మంత్రులు వచ్చే అవకాశం మాత్రం లేదు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే నలుగురు మంత్రులు ఉన్నారు. వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలనుంచి ఇద్దరేసి మంత్రులు ఉండగా, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు మంత్రివర్గంలో ఉన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా హైదరాబాద్ జిల్లా హైదరాబాద్, సికిందరాబాద్‌గా రెండు జిల్లాలుగా మారే అవకాశం ఉంది. నగరానికి చెందిన నలుగురు మంత్రుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు ఇద్దరూ సికిందరాబాద్ ప్రాంతానికి చెందిన వారే. దీంతో సికిందరాబాద్ సమస్య తీరుతుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం, భద్రాద్రి పేర్లతో రెండు జిల్లాలుగా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మరోజిల్లా మంత్రి లేని జిల్లాగా మిగిలిపోతుంది. పాలేరు నుంచి శాసన సభకు ఎన్నికైన తుమ్మల ఖమ్మం జిల్లా మంత్రిగా ఉంటారు. నూతనంగా ఏర్పడే భద్రాద్రికి మంత్రి ఉండరు. ఇక మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మూడు జిల్లాలుగా మారే అవకాశం ఉంది. సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, మెదక్ జిల్లా నుంచి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తే సంగారెడ్డికి మాత్రం మంత్రి ఉండరు. ఇక నల్లగొండలో ప్రస్తుతం ఒకే ఒక మంత్రి ఉండగా, జిల్లా మాత్రం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి మూడు జిల్లాలుగా మారుతోంది. సూర్యాపేట నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగిలిన రెండు జిల్లాలకు మంత్రులు లేని పరిస్థితి. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వనపర్తి జిల్లా కొత్తగా ఏర్పడుంది. దీనికి జూపల్లి కృష్ణారావు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నారు. నూతనంగా ఏర్పడే నాగర్ కర్నూల్ జిల్లాకు మంత్రి లేరు.
నియోజక వర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో 153 నియోజక వర్గాలు అవుతాయి. అప్పుడు మంత్రివర్గం సంఖ్య పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా 2019 ఎన్నికల్లోనే కొత్త నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు పలు కొత్త జిల్లాలకు మంత్రులు లేని పరిస్థితి ఉంటుంది.