తెలంగాణ

కాంగ్రెస్ కదన యోధులెవరో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 14: నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి బరిలోకి దిగేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతగా ఆసక్తి కానరావడం లేదు. ఇప్పటికే ఆశావహుల నుండి టీ.పీసీసీ నాయకత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా, ఇప్పటివరకు ఇందూరు నేతలెవరూ అర్జీలు పెట్టుకోలేదు. మారిన రాజకీయ పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు సెగ్మెంట్లను తెరాస పార్టీ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేయగా, ఇటీవల కాస్తంత ముందస్తుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు అదే తరహా ఫలితాలను పునరావృతం చేసింది. మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఎల్లారెడ్డి మినహా మిగతా 8నియోజకవర్గాల్లో తెరాస తాజామాజీలే తిరిగి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ గులాబీ నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించిన జగిత్యాల కోటపైనా ఈసారి గులాబీ జెండాను రెపరెపలాడించారు. ఈ సెగ్మెంట్‌కు సీఎం తనయురాలు, ఎం.పీ కల్వకుంట్ల కవిత ఇన్‌చార్జ్‌గా అన్నీతానై వ్యవహరించి పార్టీ విజయ బావుటాను ఎగురవేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం అనే కాకుండా పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అన్ని చోట్లా తెరాస అభ్యర్థులు గెలుపొందేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ విస్తృత ప్రచారం చేశారు. తెరాసకు ఒకింత ప్రతీకూల పరిస్థితులు కనిపించిన నియోజకవర్గాలపై మరింతగా దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రతీకూలతలను అనుకూలంగా మల్చుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులోనే జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుండి పోటీకి దిగేందుకు ప్రతిపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి వరుస విజయాలు సాధించిన ప్రస్తుత ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, 2014 ఎన్నికల్లో ఎం.పీ కవిత చేతిలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈసారి ఇతర నియోజకవర్గాల వైపు దృష్టిసారిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ నుండి బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్టు స్థానికంగా చర్చ కొనసాగుతోంది. భువనగిరి సెగ్మెంట్ పరిధిలో తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా నిలుస్తుందని యాష్కీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో టీఆర్‌ఎస్ మరింతగా బలాన్ని పుంజుకోవడం వల్లే మధుయాష్కీ ప్రత్యామ్నాయంగా మరో సెగ్మెంట్ గురించి ఆలోచనలు చేస్తుండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగానే ఇక్కడి నుండి సిట్టింగ్ ఎం.పీ హోదాతో కవిత తిరిగి పోటీ చేస్తే ఆమె గెలుపు కోసం లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని తెరాస ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారణంగానే ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలు ఈ స్థానం నుండి బరిలో నిలిచేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.