తెలంగాణ

ఘనంగా లక్ష్మీనారసింహుడి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 19: ‘రథస్థ మాధవం దృష్ట్య పునర్జన్మ నవిధ్యతే...’ రథంపై మాధవుడిని చూస్తే పునర్జన్మ ఉండదు. ప్రతి సంవత్సరం చూడాలి.. చూడగా చూడగా సార్థకత వస్తుంది. ఆ చూపులకు శుభం వస్తుంది. నవ వసంతం ఆరంభం నవ దంపతుల విలాసం నవనవ కాంతులతో విరజిల్లే పుష్పక విమానంలో సింగారించుకున్న రథం పుష్పాలతో విద్యుత్ దీపాలతో ముస్తాబైన రథం. అదోక క్షీర సాగర తరంగం. మంగళవాయిద్యాలతో భక్తజన సముద్ర కెరటాల వలయాల సందడి ఆ రథం నుండి నవదంపతులు ఇదంతా చూసి మురిసి పోతున్న వైనం. అదొక స్వర్గ వైభోగం. సాక్షాత్తు వైకుంఠమే దిగివచ్చి పాతగుట్టపై వ్రాలినట్లుంది. శ్రీ పాత లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం రాత్రి శ్రీ స్వామివారి దివ్యవిమాన రథోత్సవం కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. రంగురంగుల దీపాలతో వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై నవ దంపతులైన శ్రీ అమ్మవారి అయ్యవారి ఉత్సవ మూర్తులను రథంపైకి చేర్చారు. రథంపై ఉన్న స్వామి అమ్మవార్లను వేలాది మంది భక్తులు దర్శించుకుని తరించారు. పాతగుట్ట భక్తజనులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి 9గంటలకు ప్రాంభమైన రథయాత్ర 11గంటల వరకు సాగింది. అర్చకుల, యాజ్ఞికుల, వేదపండితుల వేదమంత్రాలతో బ్యాండ్ మేళాలు, మంగళవాయిద్యాలతో, సన్నాయి రాగాలతో భక్తులు కోలాటం భజనలతో అశేష భక్త జనుల గోవింద నామస్మరణాలతో రథ యాత్ర కొనసాగింది. రథ యాత్ర ఊరేగింపు సమయంలో స్వామివారిని దగ్గర నుండి చూడాలని భక్తులు ముందుకు రావడానికి ప్రయత్నించారు. స్వామివారి రథం లాగితే పుణ్యం దక్కుతుందన్న నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు రథం లాగడానికి పోటీ పడ్డారు. ఆలయ తూర్పు నుండి బయలుదేరిన రథ యాత్ర కళ్యాణమండపం వద్దకు చేరుకుని అక్కడి నుండి మళ్లీ ఆలయం వద్దకు చేరుకుంది. పురవీధులలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
గరుడ వాహనంపై ఊరేగిన స్వామి
మహావిష్ణువు సేవలో ముఖ్యమైనది గరుడ సేవ. కంచి గరుడ సేవ తెలుగులో అంటారు. విష్ణువాహనమే గరుత్మంతుడు. కల్యాణ నరసింహుడిని తన భుజస్కంధాలపై నిలిపి అంతా జనసంద్రంలో పట్టు వస్త్రాల పటాపటాలతో ఆభరణాల బరువుతో స్వామి అమ్మవార్తలకు చిరు చెమట పట్టకుండా తన రెక్కలతో నవ్వుతూ వాడవాడలా తిప్పుతున్నారు. పాత లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నవ దంపతులైన స్వామి అమ్మవార్లను అత్యంత సుందరంగా అలంకరించి గరుడవాహనంపై ఊరేగించారు. శ్రీ స్వామి అమ్మవార్లను పట్టు పీతాంబరాలతో వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో వివిధ సుగంధ పరిమళాల పుష్పాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించి గరుడవాహనంపై అర్చకుల, యాజ్ఞికుల, వేదపండితుల వేద మంత్రోచ్ఛరణలతో, బ్యాండ్ మేళాలతో, మంగళవాయిధ్యాలు, సన్నాయి రాగాలతో భక్తజనుల గీతాలాపనలతో వెంట రాగా ఆలయ తూర్చు ద్వారం గుండా బయలుదేరి పుర వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తు కల్యాణమండపం వద్దకు చేరుకుంది. కల్యాణ మండపంలోకి చేర్చిన నవదంపతులైన శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి, తరించి, పులకించి పోయారు. భక్తులకు గరుడ సేవ యొక్క విశేషాలను ఆలయ అర్చకులు వివరించారు. అనంతరం శ్రీ స్వామి వారి గరుడ సేవను ఆలయ వద్దకు రాగా స్వామి అమ్మవార్లను ఆలయంలోకి చేర్చారు. అంతకుముందు ఆలయంలో ఉదయం యాగశాలలో యాజ్ఞికులు, అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణల మధ్య హోమం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఎన్. లక్ష్మీ నరసింహ చార్యులు, ఉపప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యలు, మాధవా చార్యులు, సంపతాచార్యులు అర్చక బృందం వహించగా ఈ సేవలో దేవస్థానం చైర్మన్ బీ. నర్సింహమూర్తి, ఏఈవో మేడి శివకుమార్, ఆలయ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పన్నగేశ్వర రావు, ఆలయ దేవస్థాన సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. రథంపై విహరిస్తున్న స్వామివారు