తెలంగాణ

ప్రగతి పద్దు.. బంగారు పొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెవెన్యూ వ్యయం 1,31,629 కోట్లు
రెవెన్యూ మిగులు 6564 కోట్లు
ద్రవ్యలోటు 27,749 కోట్లు
వ్యవసాయానికి 20,107 కోట్లు
రైతుబంధుకు 12000 కోట్లు
రైతుభీమా 650 కోట్లు
రుణమాఫీకి 6000 కోట్లు
సాగునీటికి 22,500 కోట్లు
ఆసరా పెన్షన్లు 12,067 కోట్లు
రేషన్ ఖర్చు 2744 కోట్లు
ఎస్‌సీలకు 16,581 కోట్లు
ఎస్‌టీలకు 9,827 కోట్లు
మైనారిటీలకు 2004 కోట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి 1,82,017 కోట్ల రూపాయలతో ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. శాసనసభలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు (కేసీఆర్) స్వయంగా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం 50 నిమిషాల పాటు కొనసాగింది. కొత్తగా పన్నులేవీ వేయకుండా, 42 కోట్ల రూపాయల మిగులుతో బడ్జెట్‌ను రూపొందించారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకువస్తూ బడ్జెట్‌ను రూపొందించారు. గత ఆరున్నర దశాబ్దాలుగా లేని నిరుద్యోగ భృతిని ప్రకటించారు. వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఆసరా పెన్షన్లను గణనీయంగా పెంచారు. అన్ని వర్గాలకు ఊరట ఇచ్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు స్పష్టమవుతోంది. సమతుల అభివృద్ధి ధ్యేయంగా బడ్జెట్‌ను రూపొందించామని కేసీఆర్ వెల్లడించారు. బంగారు తెలంగాణ సాధన కోసం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామంటూ హామీ ఇచ్చారు. గత నాలుగున్నర ఏళ్లుగా తాను తదేక దీక్షతో తపస్సులాగా పనిచేయడం వల్లనే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తనకు మళ్లీ పట్టం కట్టారని, ప్రజల ఆకాంక్షల మేరకు
పనిచేస్తానని స్పష్టం చేశారు. 2019-20 సంవత్సరానికి రెవెన్యూ రాబడులు 1,38,193 కోట్ల రూపాయలని, రెవెన్యూ ఖర్చు 1,31,629 రూపాయలని పేర్కొంటూ, రెవెన్యూ మిగులు 6,564 కోట్లుగా ఉంటుందని ప్రకటించారు. పన్నులు, రుణాలు తదితర రూపాల్లో లభించే ఆదాయం మొత్తం 1,82,059 కోట్ల రూపాయలు కాగా, మొత్తం ఖర్చు 1,82,017 కోట్ల రూపాయలని కేసీఆర్ వివరించారు. అంటే 42 కోట్ల రూపాయలు మిగులుగా చూపించారు. గత నాలుగేళ్లలో మిగులుబడ్జెట్‌నే ప్రభుత్వం ప్రవేశపెడుతూ వస్తోంది. అలాగే నాలుగేళ్లలో రెవెన్యూ మిగులు ఉంటోంది. అయితే ద్రవ్యలోటు మాత్రం ప్రతి బడ్జెట్‌లోనూ 26 వేల కోట్ల రూపాయలు పైగానే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒట్-ఆన్-అకౌంట్ ప్రవేశపెట్టడం వల్ల తమ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి ఇదే విధానం అమలు చేస్తోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్తాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని వివరించారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ను 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్‌ను 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతున్నామన్నారు. వృద్ధాప్య పింఛన్‌కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి, పింఛన్ ఇవ్వాలని పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక కుటుంబంలో ఒకరికి ఆరుకిలోల చొప్పున ఎంత మంది ఉంటే అంతమందికి కిలో రూపాయి సబ్సిడీ బియ్యం ఇస్తామని సీఎం తెలిపారు. ఈ పథకానికి ఈ ఏడు 2,744 కోట్ల రూపాయలు కేటాయించారు.
కల్యాణ లక్ష్మి కింద ఇప్పటి వరకు 3,28,923 మందికి చేయూత ఇచ్చామని, షాదీ ముబారక్ కింద 1.08,702 మందికి సాయం చేశామని కేసీఆర్ తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు తాజా బడ్జెట్‌లో 1450 కోట్ల రూపాయలు కేటాయించారు. నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్క నిరుద్యోగికి 3.016 రూపాయలు చెల్లిస్తామని, ఈ పథకానికి 1810 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.
ఎస్‌సీ సంక్షేమం ప్రగతి కోసం 16,581 కోట్ల రూపాయలు, ఎస్‌టీలకు 9,827 కోట్ల రూపాయలు, మైనారిటీలకు 2.004 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎంబీసీ కార్పోరేషన్‌కు 1000 కోట్ల రూపాయలు కేటాయించారు.
వ్యవసాయ శాఖకు 20.107 కోట్ల రూపాయలు కేటాయించామని సీఎం తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని, గోదాముల సామర్ధ్యాన్ని 4.17 లక్షల టన్నుల నుండి 22.50 లక్షల టన్నులకు పెంచామని తెలిపారు. రైతుల రుణమాఫీ దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 2018 డిసెంబర్ 11 వరకు బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, ఈ ఏడు ఇందుకోసం ఆరువేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రైతుబంధుకు 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక్కో రైతుకు రెండు పంటలకు కలిపి ఎకరానికి 10 వేల రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నారు. రైతుభీమా వల్ల రైతుకుటుంబాలకు చేయూత లభిస్తోందని, ఈ పథకానికి ఈ ఏడు బడ్జెట్‌లో 650 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు పండించే క్రాప్ కాలనీల విధానం అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
కోటీ 25 లక్షల ఎకరాల భూమికి సాగునీటిని అందించేందుకు రూపొందించిన సాగునీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి, మిషన్ కాకతీయ కింద చెరువుల మరమ్మతులకు 22,500 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన గొర్రె పిల్లల పంపిణీ, చేపల చెరువుల్లో చేపపిల్లల పెంపకాన్ని కొనసాగిస్తామన్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, విశ్వకర్మలు, అవుసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకళాకారులు, దుస్తులు కుట్టి జీవించే దర్జీలు తదితరులకు సాయం చేస్తామన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు నూలువస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, నూలు, రసాయనాలను సబ్సిడీపై ఇస్తామని, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. పవర్‌లూం కార్మికులకు ప్రతి నెలా 15 వేల రూపాయలు తగ్గకుండా వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పేదలకు 2,72,763 ఇళ్లను మంజూరు చేశామని, వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు.
విద్యుత్తు సరఫరా, పంపిణీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేసీఆర్ తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగం వృద్ధిరేటు గణనీయంగా పెరిగిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని 2019 ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తామన్నారు.
ప్రతి గ్రామ పంచాయితీకి డాంబర్ రోడ్లు

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయితీకు డాంబర్ రోడ్లువేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర, జాతీయ రహదారులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామన్నారు.
విద్య, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యావిధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానాల ద్వారా రోగులకు మందుల కొనుగోలుకు ఈ ఏడు 440 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య రంగానికి కొత్త బడ్జెట్‌లో 5536 కోట్ల రూపాయలు కేటాయించారు. పరిపాలనా సంస్కరణలను భారీ ఎత్తున చేపట్టామన్నారు.
గ్రామ పంచాయతీలకు ఏడాదికి కేంద్ర ప్రభుత్వం 1628 కోట్లు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత మేరకు నిధులు ఇస్తుందని హామీ ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరో నాలుగువేలకోట్ల రూపాయలు కేంద్రం నుండి లభిస్తున్నాయన్నారు. మొత్తం మీద గ్రామాలకు ఏటా 8000 కోట్ల రూపాయలు లభిస్తాయన్నారు.
తెలంగాణకు హరిత హారం కింద ప్రాధాన్యత ఇస్తామన్నారు. పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయన్నారు.

దేశానికే తలమానికం ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని, బంగారు తెలంగాణను సాధిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను శుక్రవారం ఆయన శాసనసభలో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్నటి వరకు గుజరాత్, కేరళ రాష్ట్రాలను అభివృద్ధి నమూనాలుగా పేర్కొనే వారని, ఇక నుండి తెలంగాణ రాష్ట్రానికి ఈ ఖ్యాతి దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ చేపడుతున్న అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా మారుతున్నాయన్నారు. రైతుబంధును అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, కేంద్రం కూడా ఇదే తరహాలో ఒక పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో గత అరవై ఏళ్లలో తెలంగాణలో లేని అభివృద్ధి ఫలాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు లభిస్తున్నాయని గుర్తు చేశారు. అభివృద్ధి పథకాల గురించి కేసీఆర్ ప్రస్తావించిన ప్రతిసారీ టీఆర్‌ఎస్ సభ్యులు హర్షధ్వానాలు చేస్తూ, చప్పట్లు చరిచారు.