తెలంగాణ

నాగర్‌కర్నూల్‌లో స్థానికేతరులకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, మార్చి 21: ఎస్సీలకు రిజర్వు చేసిన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన వారందరూ కూడా స్థానికేతరులే కావడం విశేషం. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలలో అనేక కీలక మంత్రి పదవులను పొందిన స్థానికులైన మహేంద్రనాథ్‌ను సైతం నియోజకవర్గం ప్రజలు లోక్‌సభకు ఎన్నుకోలేదు. 2009 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారంతా కూడా స్థానికేతరులుకాగా, 2009లో లోక్‌సభ పునర్విభజనతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం స్వరూపం మారింది.
అప్పటి వరకు నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్, జడ్చర్లతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పరిగి అసెంబ్లీ సెగ్మంట్‌లు ఉండగా, పునర్విభజన అనంతరం నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌తోపాటు గద్వాల, వనపర్తి, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. నాలుగుమార్లు ఎంపీగా ఎన్నికైన జగన్నాథం సొంతగ్రామంలో అలంపూర్ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన మల్లు అనంతరాములు ఏఐసీసీలో అనేక కీలక పదవులను పొందడం జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఆయన అనేక రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌ను ద్విసభా నియోజకవర్గంగా ఏర్పాటు చేయగా రిజర్వు నియోజకవర్గం నుంచి రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికకాగా, జనార్ధన్‌రెడ్డి 1,73,926 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 1957లో జరిగిన ఎన్నికలలో జి రామేశ్వర్‌రావు 1,89,093 ఓట్లతో గెలుపొందగా, రిజర్వు స్థానం నుండి పులిరామస్వామి 1,46,601 ఓట్లతో గెలుపొందారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జిల్లాలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుంచి జేబీ ముత్యాలరావు 1,17,573 ఓట్లతో గెలుపొందారు. 1967 ఎన్నికలలో మళ్లీ జెబి ముత్యాలరావు 1,29,636 ఓట్లతో తిరిగి ఎన్నికయ్యారు. 1977లో జరిగిన ఎన్నికలలో మెదక్ జిల్లాకు చెందిన బీష్మదేవ్ గెలుపొందారు. 1981లో జరిగిన ఎన్నికలలో ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు అనంతరాములు ఎన్నికయ్యారు. 1985లో జరిగిన ఎన్నికలలో రంగారెడ్డి జిల్లాకు చెందిన తులసీరాం తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలుపొందారు. 1989 ఎన్నికలలో మల్లు అనంతరాములు తులసీరాంపై భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా మల్లు అనంతరాములును పీసీసీ అధ్యక్షుడునిగా పార్టీ అధిష్టానం నియమించింది. పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికైన అనతికాలంలోనే ఆయన గుండెపోటుతో మరణించారు. ఉపఎన్నిక నిర్వహించే సమయంలోనే పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి మల్లు అనంతరాములు సోదరుడు డాక్టర్ మల్లురవి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ నుండి మాజి మంత్రి, జిల్లాలోనే సీనియర్ నాయకులు మహేంద్రనాథ్ పోటీ చేయగా, మల్లురవికి 2,59,128 ఓట్లు రాగా, మహేంద్రనాథ్‌కు 2,08,888 ఓట్లు రాగా మల్లురవి 50,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1996లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి మళ్లీ మల్లురవి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి డాక్టర్ జగన్నాథ్ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో 76,375 ఓట్ల మెజార్టీతో జగన్నాథ్ గెలుపొందారు. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికలలోమల్లురవి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా, మంద జగన్నాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి పోటీ చేయగా మల్లురవి 19,675 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో మల్లురవి, మందజగన్నాథ్‌ల మధ్యనే పోటీ జరుగగా జగన్నాథ్‌కు 4,31,095 ఓట్లు, మల్లురవికి 3,64,195 ఓట్లు రాగా, జాతయ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన స్థానికుడైన మాజీ ఎమ్మెల్యే డీ. కిరణ్‌కుమార్‌కు 5,664 ఓట్లు మాత్రమే రాగా, మంద జగన్నాథ్ 66,900 ఓట్లమెజార్టీతో గెలుపొందారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంను టిఆర్‌ఎస్‌కు కేటాయించగా, ఆ పార్టీ నుండి కెఎస్ రత్నం పోటీ చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో పార్టీ గుర్తు రాలేదు. జగన్నాథ్‌కు 405046 ఓట్లు రాగా, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రత్నంకు 305396 ఓట్లు వచ్చాయి. 2008 చివర్లో యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం బిల్లు పెట్టగా, టీడీపీ ఎంపీగా ఉన్న మందా జగన్నాథం యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటువేయగా, టీడీపీ ఫిర్యాదు మేరకు లోక్‌సభ స్పీకర్ మందా జగన్నాథంను అనర్హునిగా ప్రకటించడంతో ఎంపీ పదవిని కోల్పోయారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించడంతోపాటు 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఉమ్మడి అభ్యర్థిగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజ్‌పై గెలుపొందారు. ఈ ఎన్నికలలో మందా జగన్నాథంకు 422745 ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుకు 374978 ఓట్లు వచ్చాయి. 2014లో జరిగిన ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మందా జగన్నాథంపై మాజీ ఎంపీ నంది ఎల్లయ్య పోటీ చేయగా మందాకు 4,03,399 ఓట్లురాగా, నంది ఎల్లయ్యకు 4,20,075 ఓట్లు వచ్చాయి. మందాపై నంది ఎల్లయ్య 16,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సారి జరిగే ఎన్నికలలో అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో రాజకీయ సందడి ప్రారంభం కాలేదు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మల్లురవి నామినేషన్ వేయగా, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పీ.రాములును ఖరారు చేయగా, మిగతా పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.