తెలంగాణ

మోదీ-రాహుల్ మధ్యే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 22: దేశ భవిష్యత్‌కు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు కీలకమైనవని, మతతత్వ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకిక వాద కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి దేశ ప్రజలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు వంతున వేస్తామని చెప్పి వేయలేదన్నారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ప్రజలను ప్రధాని మోదీ మతాలు, వర్గాల ప్రాతిపదిక విభజించి పాలించి, నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి వాటితో ప్రజాజీవనాన్ని ఛిన్నాభిన్నం చేశాడన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దేశంలో మోదీ వర్సెస్ రాహుల్‌గాంధీ మధ్య సాగుతున్నాయని, ఇందులో స్థానిక అంశాలకంటే జాతీయ అంశాలే ప్రాతిపదికగా ఉంటాయన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించబోతుందన్నారు. సీఎం కేసీఆర్‌కు గత ఐదేళ్లుగా 16 మంది ఎంపీలున్నా కేంద్రం నుంచి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలేదని, రాష్ట్ర విభజన చట్టంలోని రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించలేకపోయారన్నారు. గిరిజన, మైనార్టీల రిజర్వేషన్ల పెంపులో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ నుంచి మెజార్టీ కాంగ్రెస్ ఎంపీలను గెలిపించినట్లయితే వాటిన్నింటిని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించి చూపుతామని తాను హామీ ఇస్తున్నానంటు ఉత్తమ్ ప్రకటించారు. కారు..సారు..పదహారు మంది ఎంపీల నినాదమిచ్చిన సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు బేకార్, డమీ అభ్యర్థులను, భూకబ్జాదారులను ఎంపిక చేసి తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను అవమానించారన్నారు. మునుగోడు ఎంపీపీగా నెగ్గని చెల్లని రూపాయి వేమిరెడ్డి నరసింహారెడ్డిని తీసుకొచ్చి నల్లగొండలో తనపై పోటీకి నిలిపారన్నారు. మునుగోడులో చెల్లని రూపాయిని నల్లగొండ పార్లమెంట్‌లో కూడా ప్రజలు చెల్లనివ్వరన్నారు. నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా తాను గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీతో గెలుస్తానన్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపుతో ఈ జిల్లాలో రెండుపార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు తధ్యమన్నారు. టీజేఎస్ అధికార ప్రతినిధి కపిలవాయి దిలీప్‌కుమార్ మాట్లాడుతు టీజేఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతునిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌కు 16మంది ఎంపీలిచ్చిన చేసేదేమి ఉండదని, ఆయనకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలు ఢిల్లీలో లేవని, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తేనే కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించుకోగలుతామని టీజేఎస్ భావిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి దుబ్బాక నరసింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, నాయకులు జి.మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, కొండేటి మల్లయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, జడ్పీటీసీలు తండు సైదులుగౌడ్, తుమ్మల రాధ తదితరులు పాల్గొన్నారు.