తెలంగాణ

ఊపందుకున్న నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 22: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ గడువు ముగిసేందుకు సమయం సమీపించడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమతమ నామినేషన్లను దాఖలు చేశారు. గడువు ముగిసేందుకు మరో మూడు రోజుల వ్యవధి మిగిలి ఉన్నప్పటికీ, 23, 24వ తేదీలలో వరుసగా సెలవు దినాలు రావడంతో కేవలం చివరి రోజైన 25వ తేదీ మాత్రమే నామినేషన్ల సమర్పణకు అవకాశం మిగిలింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులంతా శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావుకు అందజేశారు. ఆమె వెంట పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. మొదటి సెట్ నామినేషన్‌ను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, మహ్మద్ షకీల్‌అమిర్‌లతో మొదటి సెట్ నామినేషన్ వేసిన ఎం.పీ కవిత, అనంతరం తన రెండవ సెట్ నామినేషన్‌ను ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌లతో కలిసి రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు సారంగపూర్‌లోని హనుమాన్ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తన నివాస గృహం నుండి గులాబీ రంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ వేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఒకరోజు ముందే అధికారికంగా ఖరారైన ధర్మపురి అరవింద్ కూడా ఉదయం వేళలోనే సారంగపూర్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన మీదట ఆలయంలోనే తన నామినేషన్ పత్రాన్ని పూరించారు. అక్కడి నుండి ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండానే సాదాసీదాగా కలెక్టరేట్‌కు చేరుకుని తొలిసెట్ నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. 25వ తేదీన రెండవ సెట్ నామినేషన్‌ను వేయనున్నట్టు ఆయన వెల్లడించారు. అరవింద్ వెంట ఆయన సతీమణితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వా లక్ష్మినర్సయ్య, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, మచల్ శ్రీనివాస్‌లు ఉన్నారు. కాగా, అందరికంటే ముందు అభ్యర్థిత్వం ఖరారైన మాజీ ఎం.పీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ శుక్రవారం నాటి వరకు కూడా ఇంకనూ నిజామాబాద్ జిల్లాకు చేరుకోలేకపోయారు. దీంతో ఆయన ప్రధాన అనుచరులు యాష్కీ తరఫున శుక్రవారం తొలిసెట్ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావుకు అందజేశారు. 25వ తేదీన మలివిడత నామినేషన్ సెట్‌ను స్వయంగా మధుయాష్కీ వేస్తారని వారు వెల్లడించారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌లను దాఖలు చేయగా, వారితో పోటీ పడుతూ పసుపు, ఎర్రజొన్న రైతులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్‌లు దాఖలు చేసేందుకు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలన్నీ ఆకుపచ్చ కండువాలు ధరించిన రైతులతో సందడిని తలపించాయి. ఇప్పటికే ఆరుగురు రైతులు నామినేషన్లు వేయగా, శుక్రవారం ఒక్కరోజే 50మందికి పైగా రైతులు నామినేషన్లు అందజేశారు. 25న మరింత భారీ ఎత్తున నామపత్రాలు దాఖలు చేసేందుకు రైతులు సమాయత్తం అయ్యారని తెలుస్తోంది.
రైతులకు పోటీగా తెరాస మద్దతుదారులు
ఇదిలాఉండగా, పసుపు, ఎర్రజొన్న రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేస్తుండడంతో వారికి పోటీగా పలువురు తెరాస మద్దతుదారులు కూడా రైతుల తరహాలోనే శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ నగరపాలక సంస్థకు చెందిన కార్పొరేటర్లు కొందరు రైతుల్లాగే ఆకుపచ్చ కండువాలు ధరించి నామినేషన్లు వేశారు. తాము తెరాసకు మద్దతుదారులమని, పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపీ కవిత అలుపెరుగని పోరాటం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.