తెలంగాణ

కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై ప్రజలే తిరగబడే రోజులు దగ్గర్లో ఉన్నాయని వివిధ పార్టీల నేతలు హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులను టీఆర్‌ఎస్ ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ సీఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క శనివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన భట్టివిక్రమార్క ప్రసంగిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సమాజం తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి దానిని ఉల్లంఘిస్తున్నారని ఆయన విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని కేసీఆర్ ఎస్టేట్‌గా మార్చారని విమర్శించారు. తాను ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను త్వరలో చేపట్టనున్నట్లు విక్రమార్క తెలిపారు.
అంతర్గత సంక్షోభం: కోదండరామ్
తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం ఉందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న వారంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద గట్టిగా నిలబడరని, ఎప్పుడైనా ప్రభుత్వం పేక మేడల్లా కూలిపోతుందని హెచ్చరించారు. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు బహిరంగంగా చెబుతున్నందున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు.
ప్రతిపక్షం ఉండాలి: టీడీపీ నేత రమణ
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం చేసే తప్పొప్పులను ఎత్తి చూపేందుకు అవకాశం ఉంటుందన్నారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలనే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఓటర్లు ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని, ప్రజలే తిరగబడతారని ఆయన హెచ్చరించారు.
గవర్నర్‌ను కలిసినా: వీహెచ్
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని తమ పార్టీ భావిస్తున్నదని చెప్పారు. అయితే గవర్నర్‌ను కలిసినా ఫలితం ఉండదన్నారు. పార్టీ ఫిరాయిస్తున్న వారికి సిగ్గుంటే ముందుగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాలన్నారు. లోగడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరంగల్‌కు వెళితే కేసీఆర్ రాళ్ళతో కొట్టించారని, ఇప్పుడేమో జగన్ ఇంటికి వెళ్ళి కేటీఆర్ మంతనాలు జరిపారని ఆయన తెలిపారు.
సమానమే అయితే: రావుల.
తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఫిరాయింపుల నిరోధకానికి రాష్టప్రతి, గవర్నర్ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల నిరోధకానికి ప్రజా ఉద్యమం చేపట్టాల్సి ఉందన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళదాం అన్నారు. ఇంకా ఈ సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరకు సుధాకర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, ప్రొఫెసర్ విశే్వశ్వర రావు తదితరులు ప్రసంగించారు.
భస్మం చేశారు: గద్దర్ ఆవేదన
ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ భారత రాజ్యాంగాన్ని భస్మం చేస్తున్నదని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వారికి గుణపాఠం నేర్పించాల్సి ఉందన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న ప్రజలకు ‘రీ-కాల్’ చేసే అధికారం కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
చిత్రం.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న గద్దర్.
వేదికపై వీహెచ్, రమణ, భట్టి విక్రమార్క, చాడ వెంకటరెడ్డి, కంచె ఐలయ్య, కోదండరామ్, చెరుకు సుధాకర్