తెలంగాణ

ఆపరేషన్ సంపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: అన్ని జిల్లాల్లో పార్టీ శక్తులను కూడగట్టుకోవడంతో ఆపరేషన్ విజయవంతం అయినట్టేనని టిఆర్‌ఎస్ భావిస్తోంది. సాధారణ ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతోనే అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఆ తరువాత క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది. సాధారణ ఎన్నికల్లో 63మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, ఇప్పుడు టిఆర్‌ఎస్ బలం 91కి చేరింది. వివిధ జిల్లాల నుంచి మరి కొందరు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా, కొంత విరామం ఇవ్వాలని ఇప్పుడే వద్దని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
పార్టీ ఫిరాయింపులపై విమర్శల నేపథ్యంలో చేరికలకు కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఆసరా వంటి సంక్షేమ పథకాలతో పాటు డబుల్ బెడ్‌రూమ్, కోటి ఎకరాలకు సాగునీరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల పట్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆసక్తి పెరిగింది. ఉత్తర తెలంగాణలో టిఆర్‌ఎస్ మొదటి నుంచి చాలా బలంగా ఉంది. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఉత్తర తెలంగాణ నుంచే వచ్చాయి. ఉద్యమ కాలంలో ఉత్తర తెలంగాణలో బలంగా ఉంటే అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణ తెలంగాణలో సైతం పార్టీ బాగా బలపడింది. ఇందుకోసం టిఆర్‌ఎస్ అన్ని రకాల వ్యూహాలను అనుసరించింది. ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం ఈ వ్యూహంలో భాగం. ప్రతి ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కని విధంగా ఫలితాలు ఉండడంతో ఇతర పార్టీల నాయకులు సైతం టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. ఉద్యమ కాలంలో, సాధారణ ఎన్నికల సమయంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే టిఆర్‌ఎస్ హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొంత బలహీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకునే విషయంలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై టిఆర్‌ఎస్ ఎక్కువగా దృష్టిసారించింది.
కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్‌ఎస్‌లో చేరుతారని తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా బలంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించినప్పుడల్లా కోమటిరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరిక ఖరారైందనే ప్రచారం జరిగేది. ముందుగా కోమటిరెడ్డి టిఆర్‌ఎస్‌లో వస్తారనుకుంటే గుత్తా సుఖేందర్‌రెడ్డి చేరారు.
శాసన మండలి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్ గెలిస్తే, మహబూబ్‌నగర్‌లో రెండింటిలో ఒక సీటు, నల్లగొండలో ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది. ఈ రెండు సీట్లు మినహా అన్ని ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తూ వచ్చింది. దాంతో ఈ రెండు జిల్లాలపై టిఆర్‌ఎస్ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. నల్లగొండ జిల్లా నుంచి ఒక ఎంపి, ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడంతో జిల్లాలో ఇప్పుడు పార్టీ తిరుగులేని శక్తిగా మారినట్టేనని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. వీరితో పాటు స్థానిక సంస్థల నాయకులు పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలతో హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు తిరుగులేదని తేలిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు టిఆర్‌ఎస్‌లో చేరిన తరువాత ఖమ్మం జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు జిల్లాలో టిఆర్‌ఎస్‌కు ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే. తుమ్మల నాయకత్వం తరువాత జిల్లాలో స్థానిక సంస్థల నాయకులు, ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు పాలేరు ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో జిల్లాలో టిఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని రుజువయింది.
ఇక నల్లగొండ జిల్లాలో గుత్తా సుఖేందర్‌రెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేసేందుకు తాను సిద్ధమేనని గుత్తా ప్రకటించారు. ఖమ్మంలో తుమ్మల నాయకత్వం తరహాలోనే నల్లగొండ జిల్లాలోనూ ఏక నాయకత్వం ఉంటేనే పార్టీ బలపడుతుందని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడా లేకుండా ఇప్పుడు తెలంగాణలోని పది జిల్లాల్లోనూ పార్టీ బలంగా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.