తెలంగాణ

జోరుగా కల్తీ విత్తనాల దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 21: అమాయక రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు ఖరీఫ్ సాగుకు ముందే కల్తీ విత్తనాల దందాతో పెట్రేగిపోతున్నారు. మధ్యదళారులు, డీలర్ల వలలో పడి రైతులు నట్టేట మునుగుతున్న విజిలెన్స్ మానిటరింగ్ అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 8.5 లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగుచేస్తుండగా ప్రతి ఏటా ఖరీఫ్‌లో 220 కోట్ల వ్యాపారం సాగవుతోంది. ఇందుకోసం ఏటా రైతులకు 22 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుండగా డిమాండ్‌కు సరిపడ విత్తనాలు మార్కెట్‌లో లభించకపోవడం, మరోవైపు గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో దళారులు అసలును పోలిన నకిలీ విత్తన ప్యాకెట్లను రంగంలోకి దించి రైతులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో విత్తన కంపెనీలు గ్రామాల్లో మైకులు, రికార్డింగ్‌ల ద్వారా హోరెత్తిస్తుండడంతో ఏది అసలో.. ఏది నకిలీయో తెలియక రైతులు ప్రతి ఏటా కల్తీవిత్తనాలు కొనుగోలు చేసి పీకల్లోతు నష్టాల్లో మునిగిపోతున్నారు. మొలక దశలోనే విత్తనాలు మొలకెత్తక కొందరు, ఏపుగా పెరిగిన పత్తి మొక్కలకు కాత రాకపోవడంతో దిగుబడి రాక వేల ఎకరాల్లో నష్టపోయి ఆత్మహత్యల బాట పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఏప్రిల్,మే మాసంలో పత్తి విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒక్కో పత్తి విత్తన సంచికి రూ.750 నుండి 850 వరకు ధర పలుకుతుండగా ఇదే అదనుగా కల్తీ వ్యాపారులు పెట్రేగిపోయి అనుమతి లేని బీటీ3, బీటీ4 రకాల సంచులను దొంగచాటుగా మార్కెట్‌లో డంపు చేసి కోట్లు గడిస్తున్నారు. దళారులు, వ్యాపారులతో ఉన్న సంబంధాల మేరకు కమిషన్లు కూడా జోరుగా అందుతున్నాయి. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల, తలమడుగు, తాంసి, నేరడిగొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్‌లో నకిలీ విత్తనాలు వేసిన రైతులకు ఎకరానికి రెండు క్వింటాళ్ళ దిగుబడి కూడా రాకపోవడంతో కంగుతినాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో పాటు రైల్వే మార్గం ద్వారా విజయవాడ, గుంటూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల నుండి యదేచ్చగా నకిలీ విత్తనాలు జిల్లాకు చేరుకొని రైతుల కొంప ముంచుతున్నాయి. నకిలీ విత్తనాల నియంత్రణకు అనేక చట్టాలు తీసుకవస్తున్నా వాటిని అమలుపర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో విజిలెన్స్ మాటరింగ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నా నకిలీ విత్తనాలను కట్టడి చేయలేకపోవడంతో వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ నకిలీ విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా వాటిని గుర్తించడంలో విజిలెన్స్ అధికారులు విఫలమవుతున్నారు. ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 5,500 నకిలీ పత్తి విత్తనాల ముడి సరకు లభ్యం కాగా వీటిలో విత్తనాలను రంగులతో ముంచెత్తేందుకు రసాయనాలను వాడుతున్నట్లు బయటపడింది. పైగా ప్యాకెట్లు కూడా రైతులను ఆకర్షించే విధంగా ఉండడం గమనార్హం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా కాగజ్‌నగర్ డివిజన్‌లో రెండు చోట్ల నకిలీ విత్తనాల వ్యాపారం బయటపడింది.
బెజ్జూరులో నకిలీ విత్తనాల పట్టివేత
ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా బెజ్జూరు మండలం పాపన్నపేట గ్రామంలో లక్షా 92వేల విలువైన నకిలీ పత్తివిత్తనాలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కొందరు దళారులు తక్కువ ధరతో రైతులకు అంటకట్టేందుకు వివిధ ప్రాంతాల నుండి తీసుక వచ్చిన గ్లైజిల్ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేని 80 పత్తి విత్తన బ్యాగులను పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జిల్లాలో పక్షం రోజుల్లోనే నాలుగుచోట్ల నకి లీ పత్తి విత్తనాల దందా బయటపడడం గమనార్హం.

చిత్రం...బెజ్జూరు మండలం పాపన్నపేటలో ఆదివారం
పట్టుబడిన నకిలీ పత్తి విత్తన బ్యాగులు