తెలంగాణ

ఊరు వదిలి... వాడ వదిలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, జూన్ 22: ప్రజా ఉద్యమ కవి, రచయిత, ప్రముఖ వాగ్గేయకారుడు గూడ అంజయ్యకు స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్‌లో అశుృనయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్‌లోని రామన్నగూడలో అంజయ్య తుదిశ్వాస వదిలిన విషయం తెలిసిందే. ఆయన కోరిక మేరకు స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హైదరాబాద్ నుండి అంజయ్య పార్ధివదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ప్రజల సందర్శనార్ధం బుధవారం ఆయన ఇంటి వద్ద భౌతికకాయాన్ని ఉంచారు. ఉద్యమాలకు ఊపిరిగా, పల్లెపాటలే తన శ్వాసగా మలుచుకొని ఇంతకాలం ప్రజాబాహుళ్యమైన పాటలతో చరిత్ర పుటల్లో నిలిచిపోయిన గూడ అంజయ్యను కడసారిగా చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, గాయకులు, బాల్యమిత్రులు లింగాపూర్ చేరుకోవడంతోనే ఆ గ్రామం విషణ్ణవదనాలతో బరువెక్కింది. పేద బతుకుల చిత్రాలను పాటలతో ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ధిక్కారస్వరాన్ని సంధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గూడ అంజయ్యతో అనుబంధాన్ని పలువురు సాహితీవేత్తలు నెమరువేసుకున్నారు. అంజయ్య మృతితో ధిక్కారస్వరం మూగబోయిందని పలువురు రోదించారు. ఈ అంతిమ యాత్రకు ప్రజాయుద్ధనౌక గద్దర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, సినీ నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొని కంట తడిపెట్టారు. అంజయ్య పార్థివదేహాన్ని సందర్శించిన గద్దర్ ‘ఊరు వదిలి.. వాడ వదిలి వెళ్ళిపోతున్నావా..’ అంటూ కంట తడితో ఉద్వేగభరితంగా ఆలపించిన పాటలు ప్రతిఒక్కరి హృదయాలను బరువెక్కించాయి. గూడ అంజయ్య తల్లి లక్ష్మమ్మ తన కొడుకు భౌతికదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడ ఉన్నవారందరిని కంటతడి పెట్టించింది. అంజయ్యకు కుమారులు లేకపోవడంతో చిన్నకూతురు మమత చేత అంతిమ సంస్కారాలు జరిపించారు. ప్రత్యేక రథం ద్వారా గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించగా జోహార్ అంజయ్య.. గూడ అంజయ్య అమర్ రహే అన్న నినాదాలు మార్మోగాయి. ఈ అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో సాహితీవేత్తలు, రచయితలు పాల్గొని నివాళులర్పించగా మాజీ డిప్యూటీ సిఎం తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎంపి బాల్క సుమన్, మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తదితరులు అంత్యక్రియలు జరిగే వరకు గ్రామంలోనే ఉండిపోయారు.