తెలంగాణ

వైభవంగా నారసింహ జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మే 17: సుప్రసిద్ధ ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం నరసింహ జయంతి ఉత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం నాడు ఉదయాత్పూర్వం నుండే క్షేత్ర దేవస్థానం లోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, వేదవిదులైన పండితులు లక్ష్మీనారసింహుని పంచోపనిషత్తులతో, పంచసూక్తములతో అభిషేకాలు, సహస్ర నామార్చనలు, భజనలు, కీర్తనలతో వైభవంగా జయంతి వేడుకలను అశేష భక్త జన సమక్షంలో నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యానురక్తులైన రసజ్ఞులు, వేదమూర్తులు, భక్తులు భక్తిసంగీతం వీనులవిందు చేయగా, భక్త్యావేశాలతో చేసిన భజనలు క్షేత్రంలో ప్రతిధ్వనించి, అలౌకిక ఆనందాన్ని కలుగజేశాయి. వేలాదిమంది భక్తులు ప్రధానాలయాల ఆవరణలలో వేచియుండి, తమ ఇష్ట దైవాలను నిరంతర కైమోడుపులతో ప్రార్థించారు. నరసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులకు గోత్రనామాదులతో అర్చనలు జరిపించి, వేదపండితులు మహదాశీర్వచనాలు అందించారు. వైదిక మంత్రాలతో, చతుర్వేద ఘోషలతో, అఖండ వైభవంగా నృసింహ పూజలు విధివిధాన వేదోక్తరీతిలో నిర్వహించారు. దేవస్థానం డీసీ, ఇఓ అమరేందర్ మార్గదర్శకత్వంలో, చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మకర్తల పర్యవేక్షణలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశశర్మ ఆచార్యత్వంలో ఆలయాల అర్చకులు సంప్రదాయ పద్ధతిలో అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. పుణె, నాందేడ్, పూర్ణ, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నందిపేట తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కార్యక్రమాలలో భాగస్వాములైనారు. అలాగే ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో హన్మాన్ పావు మండల దీక్షాపరులైన భక్తులు అధిక సంఖ్యలో దర్శనాలు చేసుకుని దీక్షాదక్షులయ్యారు.
చిత్రం...యోగానంద నారసింహునికి పంచోపనిషత్ యుక్త ప్రత్యేక పూజలు