తెలంగాణ

అందరి దృష్టీ ఇందూరు పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 22: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అనేక ప్రత్యేకతలను చాటుకున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఫలితంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ స్థానం నుండి అత్యధిక సంఖ్యలో 185మంది అభ్యర్థులు పోటీలో నిలువడం, ఎన్నికల సంఘం దీనిని సవాల్‌గా తీసుకుని దేశంలోనే తొలిసారిగా మెగా ఈవీఎంలను వినియోగిస్తూ పోలింగ్ నిర్వహించడం వల్ల ఇందూరు లోక్‌సభ ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుని ప్రతి ఒక్కరిలోనూ విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికితోడు నిజామాబాద్ సెగ్మెంట్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎం.పీ కల్వకుంట్ల కవిత తెరాస అభ్యర్థిగా వరుసగా రెండవ పర్యాయం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండడంతో ఇందూరు ఫలితం అన్ని వర్గాల వారిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుండి తొలిసారిగా బరిలోకి దిగిన కవిత లక్షా 67వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి ఏకంగా 4లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపు బావుటాను ఎగురవేస్తామని తెరాస శ్రేణులు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వరకు గట్టి ధీమాను వ్యక్తపరుస్తూ వచ్చినప్పటికీ, పోలింగ్ నాటికి పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలించలేదనే ప్రచారం గులాబీ గూటిలో ఒకింత ఆందోళనను రేకెత్తించింది. ఈ స్థానం నుండి 176మంది రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే పోటీ కొనసాగింది. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ అయిష్టంగానే నిజామాబాద్ నుండి బరిలోకి దిగాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన ప్రచారంలోనూ అంతగా పోటీ ఇవ్వలేకపోయారు. ఎటొచ్చీ టీఆర్‌ఎస్‌కు ధీటుగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గట్టి పోటీని ఇవ్వడంతో ఇందూరు ఫలితం ఏ రీతిన వెలువడుతుందనే దానిపై అందరిలోనూ ఎనలేని ఆసక్తి నెలకొంది. పోలింగ్‌కు ముందే బీజేపీ, కాంగ్రెస్‌లు తెర వెనుక మిలాఖత్ అయ్యాయని, కాంగ్రెస్‌కు దక్కాల్సిన ఓట్లు సైతం బీజేపీ ఖాతాలోకే వెళ్లాయనే ప్రచారం జరుగుతుండడం తెరాస శ్రేణులను ఒకింత కలవరపాటుకు గురి చేస్తోంది. మరోవైపు పసుపు, ఎర్రజొన్న రైతుల్లోనూ అధికార తెరాస పార్టీపై వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఎవరికివారు పైకి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ, లోలోపల మాత్రం ఫలితాలు తమకు అనుకూలంగా వెలువడతాయో లేదోననే సంశయం వారిని గడిచిన నెలన్నర రోజుల నుండి కంటిమీద కునుకు లేకుండా చేసింది. జాతీయ మీడియా, సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌తో తెరాస, బీజేపీ శ్రేణుల్లో అంచనాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. తెరాస 14 స్థానాలు, బీజేపీ ఒకటి లేదా రెండు స్థానాల్లో గెలుపొందవచ్చని సర్వేలు పేర్కొనడంతో, వాటిని ఇరు పార్టీల నాయకులు తమ విజయావకాశాలకు అన్వయించుకుంటూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాలు ఏమేరకు ఫలించాయి, ఎవరి అంచనాలు తారుమారయ్యాయన్నది నేటి ఓట్ల లెక్కింపు పర్వంతో వెల్లడి కానుంది. తెరాస అభ్యర్థి కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ల నడుమే గెలుపోటములు దోబూచులాడే అవకాశాలు ఉన్నాయని, ఎవరు విజయం సాధించినా అత్తెసరు మెజార్టీతోనే గట్టెక్కవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెరాస పార్టీ శ్రేణులు మైనార్టీల ఓట్లతో పాటు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల ఓట్లపై గంపెడాశలు పెట్టుకుని గెలుపు ఖాయమన్న ధీమాను వెలిబుచ్చుతుండగా, తెరాస ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొచ్చే అంశంగా నిలిచిందని బీజేపీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. తెరాసపై ఉన్న వ్యతిరేకత వల్లే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పసుపు, ఎర్రజొన్న రైతులు మూకుమ్మడిగా 185మంది నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచారని, అలాంటప్పుడు తిరిగి వారు తెరాసకు ఓటేసే ప్రసక్తే ఉండదని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇలా ఇరు పార్టీల నేతలు గెలుపు పట్ల ఎవరికి వారు అనుకూలతలు వెల్లడిస్తున్నప్పటికీ, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారన్నది ఇతిమిద్థంగా తేల్చి చెప్పలేని పరిస్థితి నెలకొంది.
దీంతో ఇందూరు పార్లమెంటు ఫలితం విషయంలో అటు అభ్యర్థులు, వారి మద్దతుదారులతో పాటు ఇటు అన్ని వర్గాల ప్రజలు కూడా కౌంటింగ్ అనంతరం అధికారికంగా వెలువడే ఫలితాలపై ఎనలేని ఉత్కంఠతో ఎదురుతెన్నులు చూస్తున్నారు.