తెలంగాణ

ఇసుక రేణువులతో అద్భుత శాంతి సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 11: మనసుంటే మార్గం ఉంటుంది.. ఆలోచనా శక్తి అద్భుతాలను ఆవిష్కరిస్తుంది.. ప్రజలను చైతన్యపరచడానికి ఆలోచింపచేయడానికి ఇసుక రేణువు సైతం ఉపయోగపడుతుందని నిరూపించాడు శాశ్వత సైకత శిల్పకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలం శ్రీనివాస్. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఇసుక రేణువులతో నోవార్.. నీడ్ పీస్ పేరిట ఒక అద్భుత చిత్ర రూపాన్ని ఆయన చిత్రించారు. సముద్ర తీరాలలో మాత్రమే కనిపించే సైకత శిల్పాలను సరికొత్త ఆలోచనతో శాశ్వత చిత్రపటాలుగా మలుస్తూ వస్తున్న శ్రీనివాస్ శాంతి సందేశాన్ని తన చిత్రకళ ద్వారా ప్రదర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవి జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల మంగళవారం ఈ అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. డాక్టర్ నీలం శ్రీనివాస్ 16 రోజుల పాటు శ్రమించి చిత్రించిన శాశ్వత సైకత శిల్పాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ శాశ్వత సైకత శిల్పం నిర్మాణ ఉద్దేశాన్ని వివరించారు. ప్రపంచం శాంతియుత సహజీవనంతో ముందుకు సాగాలని, యుద్ధంలేని సమాజం.. శాంతి మాత్రమే కనిపించే ప్రపంచం రావాలనే సందేశాన్ని తాను చెప్పదలుచుకున్నట్టు వివరించారు. ప్రపంచ చిత్రపటాన్ని చిత్రించిన శ్రీనివాస్ దానిచుట్టూ శాంతిహారంలాగా ప్రముఖుల చిత్రపటాలను ఇసుకతోనే చిత్రించారు. గౌతమబుద్దుడు, గాంధీ, మదర్‌థెరిస్సా, శ్రీశ్రీ రవిశంకర్, ఆంగ్‌సాంగ్ సుకీ, మలాల, నెల్సన్ మండేలా, నదియా మురార్, బరక్ ఒబామా చిత్రాలను సజీవ శిల్పాలుగా చిత్రించారు. ఎనిమిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ శాశ్వత సైకతశిల్పం నిర్మాణానికి క్వింటాల్ ఇసుక, 15 కేజీల ఫెవికాల్ గమ్ వినియోగించినట్టు శ్రీనివాస్ తెలిపారు. ఫ్రేమ్ తయారుచేయడం కోసం క్వింటాల్ 15 కేజీల ఇనుము, 50 కేజీల టేకు కర్రను ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే ఇలాంటి ఆవిష్కరణ ఇంతవరకు జరగలేదని, శాశ్వత సైకతశిల్పం చిత్రకళలో తానే ఆద్యుడినని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. శాశ్వత సైకతశిల్ప నిర్మాణం అద్భుతం అన్నారు. అద్భుతమైన చిత్రకళతో పాటు గొప్ప సందేశాన్ని సమాజానికి అందించారన్నారు. వ్యక్తుల మధ్య యుద్ధపూరిత వాతావరణం ఉండకూడదని, ఎక్కడ శాంతి నెలకొని ఉంటుందో అక్కడ అభివృద్ధి శరవేగంగా సాగుతుందని అన్నారు. ఇంతగొప్ప చిత్రకారుడు మన కురవి గ్రామానికి చెందిన వాడు కావడం నిజంగా అభినందనీయం అని రెడ్యానాయక్ ప్రశంసించారు. ఈ శాశ్వత సైకతశిల్పం కచ్చితంగా గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకుంటుందని రెడ్యానాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేకమంది ప్రముఖులు, అధికారులు పాల్గొని చిత్రకారుడు డాక్టర్ నీలం శ్రీనివాస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.