తెలంగాణ

‘నిజాం సుగర్స్’పై ఉలుకూ పలుకూ లేదేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 17: గతమెంతో ఘనంగా తన వైభవాన్ని నలుచెరుగులా చాటిన నిజాం షుగర్స్ కర్మాగారాలు పాలకుల అనాలోచిత నిర్ణయాలతో క్రమంగా అవసాన దశకు చేరుకుని మూతబడ్డాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు తలమానికంగా నిలిచిన ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీలను గత దశాబ్దంన్నర క్రితం అప్పటి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయగా, వీటిని తిరిగి స్వాధీనం చేసుకునే వ్యవహారం అటుంచి, ప్రస్తుతం కర్మాగారాలే మొత్తంగా కనుమరుగయ్యే దైన్య స్థితికి చేరుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలోనైనా నిజాం షుగర్స్‌కు పూర్వ వైభవం చేకూరుతుందని ఆశించినప్పటికీ, ఐదేళ్లు ముగిసిపోయి తెరాస సర్కార్ వరుసగా రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు ఫ్యాక్టరీల స్వాధీనానికి నామమాత్రంగానైనా చొరవ చూపలేకపోయింది. పైపెచ్చు ప్రైవేట్ యాజమాన్యం లేఆఫ్‌ను ప్రకటిస్తూ ఏకంగా కర్మాగారాలను మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఏళ్ల తరబడి నిరవధికంగా ఆందోళనలు నిర్వహించినా, నిజాం షుగర్స్ పునరుద్ధరణపై ప్రభుత్వంలో ఉలుకూ, పలుకూ కరవయ్యింది. పైపెచ్చు ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తి మేరకు నిజాం చక్కెర కర్మాగారాన్ని విక్రయించేందుకు (లిక్విడేషన్‌కు)ఎన్‌సీఎల్‌టీ అనుమతించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సమైక్య రాష్ట్రంలో ప్రైవేటీకరణతో మొదలైన కష్టాలు స్వరాష్ట్ర సాధనతో సమసిపోతాయని భావించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నిజాం షుగర్స్ కార్మికులు, నేడు ఉన్న ఉపాధిని కోల్పోయి కష్టాల కడలిలో కూరుకుపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ నిజాం షుగర్స్ అంశంపై వాడివేడిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. నిజాం షుగర్స్ స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌తో గత ఏడాది కాలం క్రితం పాదయాత్ర జరిపిన ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై, తెరాస ప్రభుత్వం తన హామీని విస్మరించడాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. సీపీఎం తదితర వామపక్ష పార్టీలు సైతం తెరాస ప్రభుత్వ నిర్లిప్త వైఖరి పట్ల ఆక్షేపణ తెలుపుతున్నాయి. ఇటీవల చట్టసభలకు జరిగిన ఎన్నికల్లోనూ నిజాం షుగర్స్ అంశమే కీలకంగా నిలిచింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో పాటు, టీ.జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలన్నీ తరుచూ నిజాంషుగర్స్‌పై ఆందోళన కొనసాగిస్తూ వస్తున్నాయి. దీంతో నిజాం షుగర్స్ హామీ కాస్తా అధికార తెరాస పార్టీని ఇరకాట స్థితికి గురి చేస్తోంది. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ముఖ్య నేతలంతా నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుంటామని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రచార వేదికలపై పదేపదే పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్‌తో పాటు కల్వకుంట్ల కవిత తదితరులంతా ఆరు నూరైనా నిజాం షుగర్స్‌కు పూర్వ వైభవం చేకూర్చడం ఖాయమని భరోసా కల్పించారు. అయితే స్వరాష్ట్రం కల ఈడేరి తెరాస రెండవసారి అధికారం చేపట్టినా, ఇంతవరకు కర్మాగారాలను స్వాధీనం చేసుకోకపోవడం, మూతబడిన వాటిని తెరిపించేందుకు కూడా ప్రయత్నాలు చేయకపోవడాన్ని విపక్షాలు పదేపదే ప్రస్తావిస్తూ తెరాస వైఫల్యంగా చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిజాం షుగర్స్ కర్మాగారాలను కాపాడేందుకు తెరాస ప్రభుత్వం చొరవ చూపుతుందా? అన్నది అనుమానంగానే మారింది. రైతులు, కార్మికులు నిరవధిక ఆందోళనలు నిర్వహించిన సమయంలోనూ ప్రభుత్వం ఫ్యాక్టరీలను సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుపడదని కరాఖండిగా తేల్చి చెప్పింది. రైతులు ముందుకు వస్తే సహకార రంగంలో కొనసాగించేందుకు తోడ్పాటును అందిస్తామని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే నిజాం షుగర్స్‌ను కాపాడుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందనే నమ్మకం ఏ కోశానా కనిపించడం లేదని కార్మికులు, చెరకు రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.