తెలంగాణ

లంచాలు మింగి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూన్ 25: ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతోంది. పట్టాదారు పాసుపుస్తకాలు చేతికి అందితే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా రైతుల బాధలు రెవెన్యూ అధికారులకు పట్టడం లేదు. దీంతో అన్నదాతలకు ఆగ్రహం వచ్చింది. తహశీల్దారు కార్యాలయంలోని సామాగ్రిని బయటవేసి ఏకంగా కార్యాలయ ద్వారానికి తాళం వేసి సుమారు గంటన్నర పాటు నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. అనేక నెలలుగా కురవి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం కార్యాలయం చుట్టూ, వీఆర్వోల చుట్టూ తిరుగుతున్నారు. అనేకమంది పాసుపుస్తకాలు రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు అప్పులు చేసి మరీ లంచాలు ముట్టజెప్పారు. అయినా అధికారులు పట్టింపులేని ధోరణి ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మంగళవారం కార్యాలయానికి చేరుకున్న రైతులు దీనిపై తమకు సరైన సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యాలయంలోని కుర్చీలను, సామాగ్రిని బయట వేసి కార్యాలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. ఉన్నతాధికారులు వచ్చి తమకు సరైన సమాధానం చెప్పేదాక నిరసన విరమించేది లేదంటూ ఆందోళనకు దిగారు. సుమారు గంటన్నర పాటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విషయం తెలుసుకున్న కురవి ఎస్సై నాగభూషణం సంఘటనా స్థలానికి చేరుకొని రైతులు, రైతుసంఘాల నాయకులతో చర్చించారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలపడం సరైన పద్ధతి కాదని పక్కకు వచ్చి నిరసన తెలపాలంటూ సర్దిచెప్పారు. అయినా ఉన్నతాధికారులు వచ్చేవరకు తాము నిరసన విరమించేది లేదంటూ తమ ఆందోళనలను కొనసాగించారు. దీంతో కురవి ఎమ్మార్వో శ్రీనివాస్ ఫోన్ ద్వారా మాట్లాడి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని ప్రస్తుతం అదేపనిలో ఉన్నామని 15 రోజుల్లో అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చేలా తప్పక చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. దీంతో రైతులు నిరసన విరమించి కార్యాలయం ద్వారాలు తెరిచారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మాలోతు కిషన్‌నాయక్, సుధాకర్, గుగులోతు బీమానాయక్, కొలిపాక వెంకన్నలతో పాటు రైతులు బానోత్ బోద్ది, కమ్లి, శారద, పుప్పాల వీరన్న, జాటోతు పద్మ, గాండ్ల యాకన్న, లక్ష్మయ్య, రాములు, వెంకటేశ్వర్లు, సాములు, శక్రు, సురేష్, లక్ష్మణ్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.