తెలంగాణ

చిరుత చిక్కింది..చింత తీరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, జూన్ 26: గత మూడు మాసాలుగా అందరినీ ముప్పుతిప్పలు పెట్టిన చిరుత చిట్టచివరికి చిక్కింది. అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులను, అటవీశాఖ అధికారులను, ఉద్యోగులను, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత బోనులోకి చేరింది. హమ్మయ్య అనేలా అధికారులు ఊపిరి తీసుకునేలా చేసింది. పటాన్‌చెరు పట్టణ శివారులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిశాట్‌లో దాదాపు మూడు నెలల క్రితం చిరుత కనిపించింది. సంస్థలోని సీసీ ఫుటేజీలలో నమోదైన వీడియో ఆధారంగా ఇక్రిశాట్‌కు సంబంధించిన అధికారులు, సిబ్బంది చిరుత ఆనవాళ్ల్లను కనిపెట్టారు. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున అది సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. గత మూడు, నాలుగు నెలల నుండి చిరుత సంచారం సాగుతోంది. సంస్థ ప్రతినిధుల నుండి తగిన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవాలని అప్పటి నుండి ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడకక్కడా పంట పొలాల మధ్య బోనులు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫిబ్రవరి మాసం ఆఖరున ఇక్రిశాట్‌లో కనిపించిన చిరుత నిన్నటి వరకు అటవీశాఖ అధికారులకు చిక్కలేదు. ప్రత్యేక తరహాలో ప్రయత్నాలు చేసి చిరుతను బంధించాలని అధికారులు చేసిన ఫలితాలు ఏమాత్రం ఫలించలేదు. ఫిబ్రవరి నెలలో కనిపించిన ఆ తరువాత కొద్ది రోజులు కనిపించకుండా పోయి చుట్టుపక్కల ప్రాంతాలలో సంచరించింది. తదనంతరం ఇరవై ఐదు రోజుల తరువాత మళ్లీ ఇక్రిశాట్‌లో దాని ఆనవాళ్లు అధికారులు గమనించారు. అప్పటి నుండి దాని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసారు. ఉదయం, రాత్రి సమయాలలో సీసీ కెమెరాలలో కనిపిస్తున్న చిరుత అటవీ శాఖ అధికారులు దానిని పట్టుకోవాలని ఏర్పాటు చేసిన బోనుకు మాత్రం చిక్కడం లేదు. ఏమాత్రం అనుమానం రాకుండా మెట్ట పంటల నడుమ ఏర్పాటు చేసిన బోను వరకు వచ్చిన చిరుత పలుమార్లు తప్పించుకున్నట్టు అధికారులు ధృవీకరించారు. చివరికి మంగళారం అర్థరాత్రి దాటిన తరువాత బుధవారం తెల్లవారు జామున బోనులో చిక్కుకుంది. ఇక్రిశాట్‌లో పంటల మధ్య ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతకు మత్తు మందు ఇచ్చి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చాకచక్యంగా జూ పార్కుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యానులో తీసుకుపోయారు. ఇంతకాలం ముప్పుతిప్పలు పెట్టిన చిరుత పులిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని అధికారులు నిర్ణయించారు.