తెలంగాణ

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 7: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు గ్రామాల్లో ఐదేళ్లు పనిచేసిన వైద్యులకు కోరిన చోటే పోస్టింగ్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని, వైద్యులు అంతరాత్మ ప్రబోధం ప్రకారం విధులు నిర్వర్తించాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను ఆదేశించారు. ఆదివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని, కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి నిర్మిస్తున్న నూతన భవనం పనులను తనిఖీ చేశారు. అనంతరం కాకతీయ మెడికల్ కళాశాలలో అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఎంజీఎంలో నెలకొన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని తెలిపారు. సహచర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపక్ష నాయకునిలా ఎంజీఎం సమస్యలను ఎప్పటికప్పుడు తనకు వివరించినట్టు పేర్కొన్నారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించనున్నట్టు తెలిపారు. అయితే ఉద్యోగులు యాంత్రికంగా పనిచేయరాదని, నిబద్ధతతో విధులు నిర్వహించి పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఎంజీఎంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తున్నట్టు తెలిపారు. తనకు కూడా ఈ జిల్లాతో అనుబంధం ఉందని తాను ఈ జిల్లావాసినేనని, ఇక్కడే పుట్టి పెరిగానని తెలిపారు. ఎంజీఎంపై తనకు మమకారం ఉందని చెప్పారు. అరోగ్య యూనివర్సిటీ, కాకతీయ మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల భవనాల పనులు వేగంగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వరంగల్ సెంట్రల్ జైల్‌ను తరలించి ఆ స్థలాన్ని ఎంజీఎం కాకతీయ మెడికల్ కళాశాల విస్తరణ పనులకు వినియోగించుటకు సేకరించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి భరోసా కల్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎంజీఎంలో అన్ని పరికరాలు దెబ్బతిన్నాయని, టెస్టులకు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అన్ని రకాల టెస్టులను ఉచితంగా చేయించేందుకు అనువైన వసతులు కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరారు. భవిష్యత్తులో సెంట్రల్ జైల్ స్థలాన్ని కూడా సేకరించి వైద్య సేవలకు వినియోగించాలని సూచించారు. ఎంజీఎం పేదల ఆసుపత్రి అని చుట్టుపక్కల జిల్లాలు, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుండి కూడా పేద ప్రజలు ఎంజీఎంకు వస్తారని తెలిపారు. వైద్యులు మరింత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ పేదల మన్ననలు పొందాలని చెప్పారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కరీంనగర్ రోడ్‌లో ఉన్న టీబీ ఆసుపత్రిని నగరం వెలుపలకు తరలించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, పార్లమెంటు సభ్యులు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, శాసన సభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, సతీష్‌కుమార్, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వైద్య విద్యా సంచాలకులు రమేష్ రెడ్డి, కేయంసీ ప్రినిపాల్ సంధ్య, ఎంజీ ఎం సూపరిండెంట్ శ్రీనివాస్‌రావు, అన్ని విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్