తెలంగాణ

‘మహా’ ప్రాజెక్టులు నిండితేనే... శ్రీరాంసాగర్‌కు జల కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 8: మహా రాష్ట్ర లోని ప్రాజెక్టులు నిండి, అదనపు నీరు వస్తేనే మన ప్రాజెక్టులకు జల కళ వచ్చే పరిస్థితి ఉండటంతో పొరుగు రాష్ట్రంలోని అదనపు జలాల కోసం ఆశగా చూడాల్సిన పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నాయ. అడుగంటిన నీటి నిల్వలతో చిక్కిశల్యమైన స్థితిలో వరద ప్రవాహం కోసం ఎదురుచూస్తున్న ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయానికి ఎగువన గల మహారాష్టల్రోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, బ్యారేజీలతో విడదీయరాని బంధం పెనవేసుకుని ఉంది. మహా రాష్ట్రలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకుంటేనే, మిగులు జలాలు ఇన్‌ఫ్లో రూపంలో దిగువన ఉన్న ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతాయి. తద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగు జలాలతో పాటు, వందలాది గ్రామాలకు తాగునీటి వసతికి భరోసా లభిస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ ఏడాది ఇప్పటివరకు తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న కారణంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం వెంటాడుతోంది. ఎగువ గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీలలోనూ నీటి నిల్వలు అత్తెసరు స్థాయికే పరిమితమై ఉండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ ఈనెల 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తినప్పటికీ, దిగువకు చుక్క నీరు కూడా ప్రవహించ లేదు. గైక్వాడ్ జలాశయం మొదలుకుని అమ్దురా, బాలేగాం, మాజల్‌గాం, దలేగాం, ఎల్దారి, సిద్ధేశ్వర్, ముద్గల్, ముళ్లి, దిగ్రాస్, ఇసాపూర్ ప్రాజెక్టులతో పాటు నిజామాబాద్ జిల్లా సరిహద్దున చిట్టచివరి బ్యారేజీగా మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ జలాశయం వరకు దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి వనరులు అడుగంటిన స్థితిలోనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఏకధాటిగా భారీ వర్షాలు కురిసినా కూడా కనీసం మరో పక్షం రోజుల వరకు కూడా ఎస్సారెస్పీలోకి వరద ప్రవాహం వచ్చి చేరే అవకాశాలు లేవనే చెప్పాలి. ఎగువన గల మహా రాష్ట్రలోని ప్రాంతమే ఎస్సారెస్పీకి ప్రధాన క్యాచ్‌మెంట్ ఏరియాగా ఉంది. పొరుగు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిస్తే తప్ప, శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి వరద జలాలు వచ్చి చేరే అవకాశాలు లేవు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినప్పటికీ, ఇంతవరకు కేవలం చుక్క నీరు కూడా ఎస్సారెస్పీలోకి వచ్చి చేరలేదు. దీంతో 1091.00 అడుగులు, 90 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యంతో 8 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1048.50 అడుగులు, 5.40 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. అందులోనూ 5 టీఎంసీల నీటిని డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. అంటే మిగతా 0.40 టీఎంసీలు కనీసం తాగునీటి అవసరాలకు కూడా వినియోగించుకునే పరిస్థితి లేకుండాపోయింది. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 1058.30 అడుగులు, 11.80 టీఎంసీల నీరు ఉండింది. ఈయేడు పూర్తిగా డెడ్‌స్టోరేజీ స్థాయికి పడిపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఖరీఫ్ సాగు పట్ల అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ ఆయకట్టు ప్రాంత రైతులు కాళేశ్వరం జలాల మళ్లింపు పైనే ఆశలు పెట్టుకున్నారు. కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీకి జలకళ సంతరింపజేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ పంపింగ్ పద్ధతిన చేపట్టిన శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల మూడవ వారం నుండి ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం జలాలను మళ్లిస్తామని మంత్రి వేముల చేసిన ప్రకటన ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
చిత్రాలు.. డెడ్‌స్టోరేజీకి చేరుకున్న శ్రీరాంసాగర్ రిజర్వాయర్
* కాళేశ్వరం జలాల మళ్లింపు కోసం సాగుతున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు