తెలంగాణ

చెరువులు నింపేందుకు వరదకాల్వకు తూములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూలై 15: వరదకాల్వకు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలతో జలకళ రానున్న నేపథ్యంలో తూముల ఏర్పాటు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో తూములను ఏర్పాటు చేసేందుకు అనుమతులు పొందిన అధికారులు, పైప్‌లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను తరలించేందుకు వరద కాల్వను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి తదితర మండలాలకు చెందిన రైతులు తమ విలువైన పంట భూములను వరదకాల్వ నిర్మాణంలో కోల్పోయారు. భూములను అందించిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ సమయంలోనే వరదకాల్వకు పలు ప్రాంతాల్లో తూములను ఏర్పాటు చేసింది. దాదాపు 8 తూములను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, చెరువులకు నీటిని మళ్లించే విధంగా పంట కాల్వలను కూడా ఏర్పాటు చేశారు. వరదకాల్వ నిండుకుండలా ప్రవహించినప్పుడే ఆ తూములు ఉపయోగపడనున్నాయి. ఆ సమయంలోనే తూములను చాలా ఎత్తుగా నిర్మించారని, కేవలం అలంకార ప్రాయంగానే కనిపిస్తున్నాయని లబ్ధి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదకాల్వలో జిల్లా సరిహద్దుల వరకు మూడు కాలాల పాటు నీరు నిల్వ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, జిల్లా సరిహద్దుల్లో క్రాస్ రెగ్యులేటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. దానివల్ల కూడా ఉపయోగం లేకుండాపోయిందని వరదకాల్వలో జలాలు ఎండమావులే అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్‌లోకి మళ్లించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో పంప్‌హౌస్‌ల నిర్మాణం కూడా చేపడుతోంది. జూలై చివరికల్లా జలాలు తరలిస్తామని, వరదకాల్వకు జలకళ వస్తుందని ఇటీవలే మంత్రి ప్రకటించారు. రివర్స్ పంపింగ్ పథకంలో భాగంగా వరదకాల్వకు వివిధ ప్రాంతాల్లో తూములను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో తూములను ఏర్పాటు చేస్తున్నారు. వేల్పూర్ మండలం సంతమల్లన్న ఎత్తిపోతల పథకానికి నీరందించేలా ఒక తూమును వరదకాల్వకు ఏర్పాటు చేస్తుండగా, మోర్తాడ్ మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన పెద్దచెరువు, రాజులకుంట, మాలకుంటలకు కూడా నీరందించేలా రెండవ తూమును ప్రతిపాదించారు. పాలెం వద్ద తూమును ఏర్పాటు చేస్తూ బూర్గుచెరువు, గోనెచెరువు, పాలెం చెరువులకు నీరందించేలా తూములు ఏర్పాటు చేస్తున్నారు. తిమ్మాపూర్ వద్ద వరదకాల్వకు తూమును ఏర్పాటు చేసి నల్లచెరువు, రాంసాగర్ చెరువు, ప్రధాన చెరువుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. కమ్మర్‌పల్లి మండలంలో ఉప్లూర్ పల్లెచెరువు, నల్లచెరువు, నాగాపురం కొత్తకుంట, నాగాపురం ఊరచెరువులకు కూడా నీరందించేలా తూములు ప్రతిపాదించారు. వరదకాల్వ 12వ కిలోమీటర్ రాయి నుండి 27వ కిలోమీటర్ రాయి వరకు 8కొత్త తూములను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ గ్రామాలకు కూడా తూములను ఏర్పాటు చేయాలనే డిమాండ్ రైతుల నుండి రోజురోజుకీ పెరుగుతోంది. ఇందులో భాగంగానే నాలుగు రోజుల క్రితం మోర్తాడ్ మండలం ధర్మోరా, వేల్పూర్ మండలం వనె్నల్(బీ) గ్రామ రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి తమ గ్రామాల చెరువులకు కూడా కాళేశ్వరం జలాలను అందించాలని కోరారు. దాదాపు 1000ఎకరాల భూములకు నీరు అందుతుందని కోరడంతో స్పందించిన మంత్రి, వెంటనే సర్వేకు ఆదేశించారు. రెండు గ్రామాల రైతులు, అధికారులు వరదకాల్వ వద్దకు వెళ్లి తూముల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని గ్రామాలు కూడా సిద్ధమవుతున్నాయి. అత్యంత విలువైన పంట భూములను కోల్పోయిన మోర్తాడ్ రైతులు కూడా తమ గ్రామానికి తూములు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వరదకాల్వలో జలాల ప్రవాహం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుందని, దాంతో పాటుగా చెరువులోకి నీటిని మళ్లిస్తే, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

చిత్రం... దొన్కల్ వద్ద తూము ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు