తెలంగాణ

ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఎందుకీ వివక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 20: తెలంగాణలో ప్రత్యేక ఉద్యమం రగిల్చి, ప్రజలను ఆందోళనబాట పట్టించటంలో కీలక భూమిక వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష కనబర్చటంపై ఆంతర్యమేంటని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల సాధనకోసం శనివారం నగరంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులదే అభివృద్ధికి దిశానిర్ధేశకులంటూ ప్రకటించి, పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం ఇచ్చిన హామీలు, చేసిన బాసలు మర్చిపోయాడని విమర్శించారు. విద్యారంగ అభివృద్ధితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందంటూ ఉపన్యాసాలిచ్చి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడని దుయ్యబట్టారు. ఐదేళ్ళ క్రితం ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత నిర్భంధ విద్య పథకం అటకెక్కిందని, అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగాల భర్తీ సంఖ్యలో 30వేల ఉపాధ్యాయుల పోస్టులు గల్లంతయ్యాయని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో గత ఐదేళ్ళలో 2 డిఎస్సీలు నిర్వహిస్తే, మన రాష్ట్రంలో మాత్రం కేవలం ఒక్క టీఆర్టీ కూడా సక్రమంగా చేపట్టలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో 16వేల మంది విద్యావాలంటీర్లను ఏటేటా కొనసాగిస్తున్నారని అన్నారు. ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వానికి ధైర్యం రావటం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్‌లో 14శాతం విద్యారంగానికి కేటాయిస్తే, స్వరాష్ట్రంలో కేవలం 6.7శాతం మాత్రమే చేయటం ఇందుకు నిదర్శనమన్నారు. కమీషన్లు లేని పని రాష్ట్రంలో లేదని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యక్తిగత రాబడి వస్తున్న దృష్ట్యా, వాటిపై సీఎం కేసీఆర్ అధికంగా దృష్టి సారించాడని, ఉద్యోగాలు భర్తీ చేస్తే ఒనగూరే ప్రయోజనాలు శూన్యం కావటంతోనే, పట్టించుకోవటం లేదన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేపట్టిన ప్రభుత్వం సరిపడా సిబ్బందిని నియమించకపోవటంతో ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నా, చోద్యం చూస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రదర్శిస్తున్న శీతకన్ను వీడి, వారి హక్కులు పరిరక్షించేందుకు సన్నద్ధం కావాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోరాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు తెరతీస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మన్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రఘుశంకర్‌రెడ్డి, కొండ్లె నారాయణరెడ్డి, కోహెడ చంద్రవౌళి, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి