తెలంగాణ

విపక్షాలను భయపెట్టేలా మున్సిపల్ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 20: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్‌ల పెంపు ప్రొసిడింగ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు డీకే. అరుణ ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాల్టీ పరిధిలో శనివారం బీజేపీ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌కు ప్రజలపై ప్రేమ కంటే పదవిపై ఆశ ఎక్కువన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పెన్షన్‌ల పెంపు రాజకీయ ఎత్తుగడన్నారు. ఖాళీ ప్రొసిడింగ్‌లు ఎందుకు నగదు పంపిణీ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలపై కోర్టు స్టే ఇస్తున్నా, ఎన్నికలపై తొందర ఎందుకని కోర్టు మందలిస్తున్నా, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా కన్పించడంలేదన్నారు. మున్సిపల్ ఓటర్ల జాబితాలు, వార్డుల విభజన తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. కొత్త పంచాయతీ, మున్సిపల్ చట్టాలు ఇతర పార్టీలను భయబ్రాంతులను చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. పరోక్షంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులను బెదిరించే విధంగా చట్టాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో చేర్పించుకునేందుకు చట్టాలను వాడుకునేందుకు మార్గం సుగుమం చేసుకుంటున్నారని విమర్శించారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే సర్పంచ్, కార్యదర్శిని బాధ్యులను చేస్తామనడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. నాలుగు విడుతలుగా నాటిన మొక్కల్లో ఎన్ని పెరిగాయని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాటిన మొక్కలే ఎండిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు వీరు కూడా పదవుల్లో ఉండేందుకు అనర్హులన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. పైసా ఇవ్వకుండా మాటలు చెప్పుతూ పూట గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కుమార్తె కవితను ఓడించి బీజేపీకి పట్టం కట్టిన విషయాన్ని గుర్తుచేశారు. దేశం మొత్తం మోదీ వైపు చూస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు సైతం కేసీఆర్‌ను గద్దె దించి బీజేపీకి అవకాశమివ్వాలన్న నిర్ణయానికి వచ్చారన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని పేర్కొన్నారు. బీజేపీని పల్లెల్లో బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల బిక్షంగౌడ్, నాయకులు దోనూరి వీరారెడ్డి, కడగంచి రమేష్, మనె్న ప్రతాపరెడ్డి, పాలకుర్ల జంగయ్యగౌడ్, బత్తుల జంగయ్య, సుర్కంటి రంగారెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, దాసోజు బిక్షమాచారి, కాయితి రమేష్‌గౌడ్, బాతరాజు సత్యం, రమనగోని శంకర్, వనం ధనుంజయ్య, బడుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... చౌటుప్పల్‌లో శనివారం జరిగిన కార్య క్రమంలో కండువాలు కప్పి మహిళలను బీజేపీలోకి ఆహ్వనిస్తున్న ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ