తెలంగాణ

ఓటమి భయంతోనే పింఛన్ల హడావుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 21: మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్ మంజూరీ పత్రాల పంపిణీ పేరుతో హడావుడి చేస్తోందని మాజీ మంత్రి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాల్టీ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు వార్డుల విభజనను, ఓటర్ల జాబితాల రూపకల్పనను కేసీఆర్ ప్రభుత్వం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రూపొందించిందన్నారు. వార్డుల విభజనలో జరిగిన అక్రమాలపై హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం టీఆర్‌ఎస్‌కు చెంప పెట్టువంటిదన్నారు. కొత్త మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలతో స్థానిక సంస్థల అధికారులను హరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం 73, 74 రాజ్యంగ సవరణ స్ఫూర్తిని నీరుగార్చేదిగా ఉందని విమర్శించారు. అవినీతి నెపంతో వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తామనడం అసంబద్ధంగా ఉందని తప్పులు చేసిన అధికారులపై చర్యలకు చట్టాలున్నాయన్నారు. తన వద్దనే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక శాఖలు పెట్టుకున్న సీఎం కేసీఆర్ పనికిరాని శాఖలను మంత్రులకు అప్పగించి వారిని డమీలుగా మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నల్లగొండను దత్తత తీసుకుంటానని ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన సీఎం కేసీఆర్ మళ్లీ దాని ఊసెత్తడం లేదని, కొత్తగా ఒక్క అభివృద్ధి పనికూడా నల్లగొండ పట్టణంలో చేపట్టలేదన్నారు. నల్లగొండ మున్సిపాల్టీని కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ కాపాడుకుంటుందని, నాల్గవసారి కూడా నల్లగొండ మున్సిపాల్టీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుందన్నారు. నల్లగొండ కలెక్టర్ టీఆర్‌ఎస్ కార్యకర్త మాదిరిగా మాట్లాడుతున్నారని, మున్సిపాల్టీ అభివృద్ధి పనుల నిధుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. ఉమ్మడి నల్లగొండకు సంబంధించిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని వెంకట్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు పెడుతూ వందల కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, ఉదయ సముద్రం ఎత్తిపోతలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి ఉదయ సముద్రం ఎత్తిపోతల పూర్తికి ప్రాజెక్టు నుండి జలసౌధ వరకు పాదయాత్ర చేస్తానని, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం సాధనకు సెప్టెంబర్‌లో పోరాట కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. మూసీ జలాల ప్రక్షాళన, ఎయిమ్స్ ప్రారంభం సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించానని, ప్రధాన మంత్రి నరేంద్రమోదీఅపాయింట్‌మెంట్ కోరానన్నారు. సిరోంఛ-మాచర్ల జాతీయ రహదారి పూర్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశానన్నారు. ఆయా సమస్యల సాధనకు కేంద్ర ప్రభుత్వం వద్ద నిరంతరం తన ప్రయత్నాలు కొనసాగిస్తానన్నారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి వంగాల స్వామిగౌడ్, డీసీసీ కార్యదర్శి గుమ్మల మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, అల్లి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.