తెలంగాణ

జఠిలమవుతున్న భూ వివాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్ : రాష్ట్రంలో భూములకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్న రైతులు తమ సమస్యలను అధికారులకు చెప్పినా తీరే మార్గం కానరాక ఆత్మహత్యా యత్నాలకు బాధపడుతున్నారు. తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఆవేదనతో ఇద్దరు రైతులు వేర్వేరు ప్రదేశాల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. కబ్జాకు గురైన తన భూమిని తిరిగి తనకు ఇప్పించాలని కోరుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో ఓ దళిత రైతు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలివచ్చి కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, అతనిని గమనించిన కలెక్టరేట్‌లోని పోలీసులు, ఇతర సిబ్బంది హుటాహుటిన స్పందించి అడ్డుకున్నారు. బాధిత రైతును ప్రజావాణి కార్యక్రమం నిర్వహణలో నిమగ్నమై ఉన్న కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు వద్దకు తీసుకెళ్లగా, కన్నీటి పర్యంతం అవుతూ తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ ఘటనకు సంబం ధించిన వివరాలిలా ఉన్నాయి. డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు రాములుకు ప్రభుత్వం అసైన్డ్ భూమిని కేటాయించగా, గత 30 సంవత్సరాల నుండి ఆ భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన అభిలాష్‌రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమిలో నుండి 27 గుంటలను కబ్జా చేసుకున్నాడని రాములు ఆరోపించాడు. ఈ విషయమై ఇప్పటికే అనేక పర్యాయాలు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు, పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని వాపోయాడు. అభిలాష్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం వల్లే అధికారులు ఆయన చెర నుండి తన కబ్జా భూమిని తిరిగి ఇప్పించేందుకు సుముఖత కనబర్చడం లేదని ఆక్షేపించాడు. తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కుంటే తామెలా బతుకును వెళ్లదీయాలని మనోవేదనకు లోనయ్యాడు. విషయాన్ని నేరుగా జిల్లా పాలనాధికారికి వివరించాలని, ఆ మేరకు అవకాశం చిక్కకపోతే బలవన్మరణం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి సోమవారం తన భార్య అంజమ్మ, కుమార్తెలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో అర్జీ సమర్పించుకునేందుకు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అప్పటికే అనేక మంది అర్జీదారులు క్యూలైన్‌లో వేచి ఉండడంతో కలెక్టర్‌ను కలువడానికి ముందే రాములు ప్రగతిభవన్ ఎదుట తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని, నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన కలెక్టరేట్‌లోని పోలీసులు, ఇతర సిబ్బంది పరుగున వచ్చి రాములు చేతిలో ఉన్న అగ్గిపెట్టె, కిరోసిన్ డబ్బాను లాక్కున్నారు. రాములును కలెక్టర్ వద్దకు తీసుకెళ్లగా, బాధితుడు తన భూమి కబ్జాకు గురైందని వివరించాడు. ఈ విషయమై విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని జే.సీ వెంకటేశ్వర్లుకు కలెక్టర్ సూచించారు. తన భూమిని తనకు అప్పగించి, కబ్జాకు పాల్పడిన అభిలాష్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తనకు చావే శరణ్యమని రైతు రాములు వాపోయాడు.
మహబూబాబాద్ ప్రజావాణిలో గిరిజన రైతు
మహబూబాబాద్: ప్రభుత్వం గతంలో తనకిచ్చిన భూమి ఇప్పుడు తనది కాదంటూ రెవెన్యూ అధికారులు సాగుచేసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో కలెక్టర్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఒక గిరిజన రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్ సమావేశమందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య స్వయంగా ప్రజల నుండి ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్నారు. అదేక్రమంలో బయ్యారం మండలంలోని వెంకట్రాంపురం శివారు జగ్నతండాకు చెందిన భూక్య కాశీరాం, భూక్య సుభద్ర దంపతులు ప్రజావాణికి వచ్చారు. కలెక్టర్ శివలింగయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో తాము నక్సలైట్ ఉద్యమంలో పాల్గొని లొంగిపోయిన సందర్బంలో ప్రభుత్వం 4.20 ఎకరాల వ్యవసాయ భూమిని తమకు అందజేసిందని 2013 నుండి ఇటీవలి కాలం దాకా ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నామని కాని ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఆ భూమి తమది కాదని బయటకు గెంటివేసే ప్రయత్నం చేస్తున్నారని కాశీరాం కలెక్టర్ శివలింగయ్యకు వివరించారు. అంతలోనే వెంట తెచ్చుకున్న సీసాలోంచి పెట్రోల్‌ను ప్రజావాణి నిర్వహిస్తున్న సందర్భంలోనే కలెక్టర్ ఎదుటే తనపైన పోసుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా ప్రజావాణిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే తెరుకున్న పోలీసులు రంగంలోకి దిగి కాశీరాంను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన కాశీరాం మాట్లాడుతూ.. మాజీ నక్సలైట్స్‌మైన తమకు 4.20 ఎకరాల వ్యవసాయ భూమిని జీవనోపాది కోసం ప్రభుత్వం ఇచ్చిందని ఇటీవల కొందరు ఇది తమ భూమి అంటూ పిర్యాదు చేయడంతో సర్వే చేసిన రెవెన్యూ అధికారులు 20 గుంటల భూమి మాత్రమే తనదని, మిగతా నాలుగు ఎకరాలు తనది కాదని వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ అనేకసార్లు తహశీల్దారు, ఆర్డివో కార్యాలయాల్లో వినతులు సమర్పించినా న్యాయం జరుగలేదని దాంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజావాణిలో ఈ చర్యకు పాల్పడాల్సి వచ్చిందని తెలిపారు.
చిత్రాలు.. నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు యత్నించిన దళిత రైతు రాములు
*మహబూబాబాద్‌లో ప్రజావాణిలో కలెక్టర్ ఎదుటే పెట్రోల్ పోసుకుంటున్న గిరిజన రైతు కాశీరాం