తెలంగాణ

పద్యం పదునైన ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులని ఆయన కుమారుడు దాశరథి లక్ష్మణ్ అన్నారు. దాశరథి కృష్ణమాచార్యుల 95వ జయంతి వేడుకలను మంగళవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (ఎంసీహెచ్‌ఆర్‌డి) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారుల సంఘం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దాశరథి కుమారుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, మేటి క్రమ శిక్షణ, లోతైన నిబద్ధత దాశరథి ప్రత్యేకతలని అన్నారు. ఈ సుగుణాల వల్లనే సాహిత్యపరంగా దాశరథి బహుముఖంగా రాణించగలిగారన్నారు. ఒక కవిగా, రచయితగా, గీత రచయిత కంటే ముందు దాశరథి ఒక గొప్ప మానవతావాది అన్నారు.
సాహిత్యమే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటం చేసిన మహాధీరుడు దాశరథి అని కొనియాడారు. తెలంగాణ విముక్తి కోసం ఆయన అందించిన స్ఫూర్తి, చేసిన రచనలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయని అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా నినదించిన దాశరథి, తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం చారిత్రక ఉద్యమానికి ప్రేరణగా నిలిచారన్నారు. దాశరథి తెలుగు కవి అయినప్పటికీ తెలుగు, ఉర్దూలను ఆయన తన రెండు కండ్లుగా భావించి సాహిత్య జీవనం చేశారన్నారు. కేవలం రచనలకే పరిమితం కాకుండా పలుమార్లు జైలుకు కూడా వెళ్లిన ఉద్యమ నాయకుడు దాశరథి అని కొనియాడారు. జైలులో ఉన్నప్పుడు పళ్లు తోముకోవడానికి ఇచ్చే బొగ్గుతో జైలు గోడలపై దాశరథి పద్యాలు రాసి ఉద్యమ చైతన్యాన్ని రగిలించారన్నారు. ఎంసిహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ బీపీ ఆచార్య మాట్లాడుతూ, అణగారిన వర్గాల వేదన, పేదరికం వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం దాశరథి తపించారన్నారు. ఆ తపన గ్రూప్ వన్ అధికారులకు స్ఫూర్తిగా నిలువాలన్నారు. ఈ సందర్భంగా దాశరథి జీవిత విశేషాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. శిక్షణలో ఉన్న కొందరు అధికారులు దాశరథి రచించిన గేయాలను పాడి వినిపించారు.
చిత్రం...దాశరథి కృష్ణమాచార్య జయంతి సభలో మాట్లాడుతున్న ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ బీపీ ఆచార్య