తెలంగాణ

తెరుచుకున్న బాబ్లీ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 1: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం పైకి లేపి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ వర్షాకాలం సీజన్ ముగింపు సమయమైన అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ ప్రాజెక్టు గేట్లను యథాతథంగా తెరిచి ఉంచనున్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు, బాబ్లీ నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు అత్యున్నత స్థాయిలో నియమించిన సిడబ్ల్యుసి కమిటీ ప్రతినిధుల సమక్షంలో 14గేట్లను పైకి ఎత్తి నీటిని వదిలారు. సిడబ్ల్యుసి ఇ.ఇ శ్రీనివాస్ సమక్షంలో మహారాష్టల్రోని నాందేడ్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఇ.ఇ నవరాలే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సారెస్పీ ఎస్.ఇ సత్యనారాయణ, ఇ.ఇ రామారావు, డి.ఇ జగదీష్‌లు బాబ్లీ వద్దకు చేరుకుని ఈ ప్రక్రియను పరిశీలించారు. ప్రస్తుతం బాబ్లీ వద్ద 0.31టిఎంసిల నీటి నిల్వలు ఉండగా, ఒక్కో గేటు ద్వారా 6500క్యూసెక్కుల చొప్పున మొత్తం 14గేట్ల ద్వారా 90వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరేందుకు 12గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. అంటే ఉదయం 11.30గంటల సమయంలో గేట్లను తెరువగా, శుక్రవారం అర్ధరాత్రి సమయానికి ఎస్సారెస్పీలోకి బాబ్లీ నుండి విడుదలైన వరద జలాలు వచ్చి చేరనున్నాయి. అయితే బాబ్లీ గేట్లు తెరిచినప్పటికీ దిగువ గోదావరిలోకి అంతంతమాత్రంగానే నీటి ప్రవాహం కనిపిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు వద్ద కూడా నీటి నిలువలు కేవలం 0.31టిఎంసిల వరకే పరిమితమవడంతో అరకొర స్థాయిలోనే దిగువ భాగానికి నీరు ప్రవహిస్తోంది. కాగా, గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్తంత పరిస్థితి మెరుగ్గానే ఉండడం స్వల్ప ఊరటనిస్తోంది. గతేడాది గేట్లు ఎత్తే సమయానికి బాబ్లీ వద్ద కేవలం 0.17టిఎంసిల నీరు మాత్రమే నిలువ ఉండింది. ప్రస్తుతం దానికి రెట్టింపు స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో గేట్లు పైకి లేపిన వెంటనే గోదావరి గట్లకు ఇరువైపులా తాకుతూ నీరు ప్రవహించడం కమనీయ దృశ్యాన్ని ఆవిష్కరించింది. బాబ్లీ బంధనాలు వీడిన నేపథ్యంలో వర్షాలు ఊపందుకుంటే దిగువ గోదావరిలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చే ఆస్కారం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బాబ్లీ నీటి నిలువ సామర్థ్యం 2.74టిఎంసిలుగా పేర్కొంటున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నీటిని వినియోగించుకునేలా ఈ బ్యారేజీని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడడం, బాబ్లీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురియని కారణంగా ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పటికీ ఎస్సారెస్పీలోకి వరద జలాలు చేరుకోలేకపోయాయి. ఇప్పుడు కూడా బాబ్లీ వద్ద అరకొర స్థాయిలోనే నీటి నిల్వలు ఉండడంతో గేట్లు పైకి లేపడం వల్ల తక్కువ పరిమాణంతో దిగువ గోదావరిలోకి వరద జలాలు ప్రవహిస్తున్నాయి. మొట్టమొదటగా మన రాష్ట్రంలోకి గోదావరి అడుగుపెట్టే త్రివేణి సంగమమైన కందకుర్తి వద్ద నిన్నమొన్నటి వరకు కూడా ఎడారిని తలపించగా, ప్రస్తుతం బాబ్లీ గేట్లు ఎత్తడం, చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండడంతో త్రివేణి సంగమ ప్రాంతం ఒకింత జలకళను సంతరించుకుంది. బాబ్లీ నుండి విడుదలైన జలాలు శుక్రవారం అర్ధరాత్రి నాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరే అవకాశాలుండడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం ఎంతోకొంత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 1091.00అడుగులు, 90టిఎంసిలు కాగా, ప్రస్తుతం 1046.60 అడుగులు, 4.5టిఎంసిల వద్ద నీరు నిలిచి ఉంది. ఎస్సారెస్పీలో 5టిఎంసిలకు నీరు చేరితేనే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. అలాంటిది ప్రస్తుతం డెడ్‌స్టోరేజీ కంటే దిగువకు నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘సాగర్’ క్యాచ్‌మెంట్ ఏరియాగా ఉన్న ఎగువ భాగంలోని మహారాష్టల్రో భారీ వర్షాలు కురిస్తేనే ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది.