తెలంగాణ

పసుపు బోర్డు కోసం అమీతుమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 24: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అత్యధిక విస్తీర్ణంలో పసుపు పండిస్తున్న తెలంగాణ ప్రాంత రైతాంగం చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటు కల సమీప భవిష్యత్తులో సాకారమయ్యే సూచనలు కనిపించడం లేదు. గడిచిన దశాబ్దన్నర కాలంగా గల్లీ నుండి మొదలుకుని ఢిల్లీ స్థాయి వరకు ఆందోళనలు చేపట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచినా ఫలితం లేకుండాపోతోంది. చివరకు పార్లమెంటు ఎన్నికలను వేదికగా మల్చుకుని మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించినప్పటికీ, పసుపు బోర్డు కల నెరడేరడం లేదు. ఎన్నికల సమయంలో బాండ్ పేపర్లపై లిఖితపూర్వకంగా హామీలిచ్చి పసుపు రైతుల మద్దతును కూడగట్టుకుని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నేతలు సైతం బోర్డు ఏర్పాటు విషయంలో తమ నిస్సహాయతనే వెలిబుచ్చుతున్నారు.
ఈ దిశగా కేంద్రం వైపు నుండి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విసుగెత్తిన పసుపు రైతులు మలివిడత ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఆర్మూర్‌లోని మార్కెట్ యార్డు ఆవరణలో పసుపు రైతులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పసుపు బోర్డు, మద్దతు ధర సాధనే లక్ష్యంగా మలివిడత ఉద్యమ కార్యాచరణ రూపకల్పన దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ఆదివారం నాటి పసుపు రైతుల సమావేశం పైనే కేంద్రీకృతమై ఉంది. దేశంలోనే అత్యధికంగా పసుపు పంట సాగయ్యే ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు పేరుంది. ఈ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ రైతులతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాలలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ రైతులు పసుపు పంటను సాగు చేస్తారు. దేశంలో తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాలు కూడా పసుపు పంటను సాగు చేస్తున్నప్పటికీ, ఒక్క నిజామాబాద్ ప్రాంత రైతులే దేశం మొత్తం మీద సాగయ్యే పసుపు పంటలో 30శాతం పంటను సాగు చేస్తారు. ఈ పంట సాగు కోసం పెట్టుబడులు గణనీయంగా పెరగడం, అందుకు అనుగుణంగా మద్దతు ధర లభించక యేటేటా నష్టాలను చవిచూస్తున్నారు. ఈ పరిస్థితి దూరం కావాలంటే పసుపు బోర్డు ఏర్పాటే శరణ్యమని గట్టిగా విశ్వసిస్తున్నారు. దీనికోసం తాజాగా ఉద్యమ కార్యాచరణకు మరోమారు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పసుపు రైతుల కదలికలను ఎంతో నిశితంగా గమనిస్తున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే రీతిలో పసుపు రైతులు క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో ఇందూరు రాజకీయాలు వారి చుట్టే తిరుగుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే పసుపు రైతులు తమ డిమాండ్ల సాధన కోసం వినూత్న పంథాలో మూకుమ్మడిగా ఎన్నికల బరిలో నిలిచి సంచలనం సృష్టించిన విషయం విదితమే. 176మంది రైతులు పోటీ చేయడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
ఈ తరుణంలోనే పసుపు రైతులను ఆకట్టుకునేందుకు బీజేపీ తరఫున పోటీ చేసిన డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్ తనను గెలిపిస్తే పక్షం రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని, మద్దతు ధర అందేలా చర్యలు చేపడతానని, లేనిపక్షంలో పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమిస్తానని ఏకంగా బాండ్ పేపర్‌పై లిఖితపూర్వక హామీ ఇచ్చి పసుపు రైతులను ఆకట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఈ హామీ ఫలితంగానే ఆయన సిట్టింగ్ ఎంపీగా టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కల్వకుంట్ల కవితను సైతం ఓడించి అనూహ్య రీతిలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రం ఇంతవరకు నెరవేరకపోవడంతో పసుపు రైతులు మలివిడత ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు. ఇదివరకటి తరహాలోనే ప్రస్తుత మలివిడత పోరును కూడా రాజకీయ పార్టీలకు అతీతంగానే చేపట్టాలని భావిస్తున్నారు. బోర్డు ఏర్పాటైతే తమ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పోరుబాటను కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.

పసుపు బోర్డు కోసం కదం తొక్కిన రైతన్నలు (ఫైల్ ఫొటో)