తెలంగాణ

విద్యారంగాన్ని నిరాశ పరిచిన బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్ధిక మాంద్యం పేరుతో విద్యారంగానికి భారీగా కోతలు విధించడం దారుణమని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మొత్తం బడ్జెట్‌లో 7.6 శాతంగా కేటాయింపులు జరగ్గా ఈ ఏడాది బడ్జెట్‌లో అది 6.7 శాతానికి కుదించారని అన్నారు. విద్యారంగంపై ప్రభుత్వ వైఖరిని, చిత్తశుద్ధినీ తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు. 1,46,492 కోట్ల రూపాయిల బడ్జెట్‌లో విద్యారంగానికి 9899.80 కోట్లు మాత్రమే కేటాయించారని వారు విమర్శించారు. ఇది బడ్జెట్‌లో 6.75 శాతానికి సమానమని అన్నారు. ఇందులో పాఠశాల విద్యకు 8299 కోట్లు, ఉన్నత విద్యకు 1367.88 కోట్లు, సాంకేతిక విద్యకు 362.91 కోట్లు కేటాయించారు. గత ఆర్ధిక సంవత్సరం విద్యారంగానికి 13,278 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్య మొత్తం కేటాయింపులో ప్రాధమిక విద్యకు 7781.5 కోట్లు, ప్రభుత్వ పరీక్షల విభాగానికి 24.62 కోట్లు, వయోజన విద్యకు 22.76 కోట్లు, ప్రభుత్వ గ్రంథాలయాలకు 51.35 కోట్లు, జవహర్‌బాల భవన్‌కు 4.21 కోట్లు , ప్రభుత్వ పుస్తకాల ప్రచురణకు 35.9 కోట్లు, తెలంగాణ రాష్ట రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు 147.52 కోట్లు, సమగ్ర శిక్షా పథకానికి 135.4 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల్లో ప్రగతి పద్దు కింద కేటాయించింది కేవలం 693.3 కోట్లే కావడంతో పాఠశాలల నిర్వహణ , వౌలిక వసతుల కల్పనకు ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవని విద్యారంగం విశే్లషకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, టాయిలెట్లు ఇతర వౌలిక సదుపాయాలకు ఈ నిధులు ఎలా సరిపోతాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని వివిధ సంఘాల నేతలు ప్రశ్నించారు.
దెబ్బతీసే బడ్జెట్
అతితక్కువ నిధులను కేటాయించడం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు మరింత పతనమయ్యే పరిస్థితి దాపురించిందని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్ అధ్యక్షుడు ఎన్ నారాయణ పేర్కొన్నారు. అంకెలు పెద్దగా కనిపించినా, అసలు విషయానికి వచ్చేసరికి ఆ నిధులు ఏ విధంగానూ సరిపోవని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం కేటాయింపులు విద్యాశాఖకు ఏ విధంగానూ సరిపోవని, అరకొర నిధులతో అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్ , పారిశుద్ధ్య కేంద్రాలు, ఇతర వౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ అధ్యక్షుడు బీ రఘునందన్, ప్రధానకార్యదర్శి కే రమణ పేర్కొన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బోయిన్‌పల్లి రాము వేరొక ప్రకటనలో ప్రభుత్వ కేటాయింపులను తీవ్రంగా విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి ఆలోచించి పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్య అందించడంపై చిత్తశుద్ధి చూపాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కేటాయింపులు నిరసిస్తూ ఛలో అసెంబ్లీ నిర్వహించగా, పోలీసులు పీడీఎస్‌యూ కార్యకర్తలను అరెస్టు చేసి గాంధీ నగర్, ముషీరాబాద్ పోలీసు స్టేషన్లకు తరలించినట్టు ఆయన చెప్పారు.
ప్రభుత్వం కేటాయించిన స్వల్ప కేటాయింపులతో విద్యాభివృద్ధి ఎలా సాధ్యమని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్సు అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తోందని, దానికి ఈ కేటాయింపులే నిదర్శనమని ఆయన విమర్శించారు. మరో సారి స్వల్ప కేటాయింపుల ద్వారా ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ మరో ప్రకటనలో విమర్శించారు.